Friday, October 21, 2011

తల్లి ..!!!

కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్ప పాటుదే ఈ ప్రయాణం అన్నారు అలి సెట్టి ప్రభాకర్. జనన మరణాలు, పాప పుణ్యాలను భరించేది ఆ భగవంతుడైతే జీవితాన్ని అందించేది మాత్రం తల్లే. ఒక సందర్భం లో శ్రీ కృష్ణుడు అర్జునుని కి దేహాంతర ప్రాప్తి ని వివరిస్తూ
దేహినో ‘స్మిన్ యథా దేహే
కౌమారం యవ్వనం జరా
తధా దేహాంతర-ప్రప్తిర్
ధీరసస్త్రాను ముహ్యతి
ఈ దేహం కౌమారం , యవ్వనం, వృద్యాప్యములను దాటుకుని వేరొక దేహము లో కి ప్రేవేశిస్తుంది ధీరులైన వారు ఈ విషయమును గూర్చి సదా చింతించవలదు . ఎలా అయితే పాత దుస్తులను వదిలి కొత్త దుస్తులను ధరిస్తామో అలాగే ఈ ఆత్మ పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది.

దేహం నుండి విడదీయబడిన జీవుడు తనకు అనువైన గర్భస్థానం కోసం పరిపరాల వెతుకుతూ ఉంటాడు. తిరిగి ఒక దేహాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్ని అగచాట్లు పడతాడో కదా . అండ , పిండ , బ్ర్మ్హహాండం అయ్యే వరకు మల మూత్రాదులతో తొమ్మిది నెలలు తన శరీరాన్ని సృష్టించుకోవడం కోసం తాపత్రయ పడతాడు. ఏ క్షణాన్నైనా, ఏ కారణం చేతనైన తనకు గర్భాన్ని ఇచ్చిన మాత్రుదేవత కాదనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఆ శరీరాన్ని వదిలి వెళ్లి పోవాల్సిందే. తిరిగి అదే కష్టాలు . ఇన్ని కష్టాలు పడి శరీరం ఆపాదించుకున్న ఆ 'శిశువు ' తన శిరస్సు బయట పడటాని కోసం ఎన్ని యోగాలు చేస్తాడో . గర్భం లో తన తల్లిని ప్రాధేయ పడతాడు 'అమ్మ ..ఈ ఒక్క జన్మనివ్వు , నా వేదనను నీ వేదన గా భరించమ్మ. జన్మ జన్మ లకు నీకు ఋణపడి ఉంటాను అని. అలా అని ఆ శిశువు లోపల కష్టపడకుండా ఉండదు కదా. మల మూత్రాదులను విసర్జించే యోని మార్గం గుండా రావటానికి సందేహించడు నిస్సందేహంగా శిరస్సు ను భూమి మీద పెట్టడానికి ప్రయత్నిస్తాడు . ఏ క్షణాన్నైనా దేహాన్ని వదిలిపెట్టేయ్యాల్సి వస్తుందేమో , గట్టిగా పట్టుకుంటాడు దేహాన్ని, అమ్మా నన్ను బయటకు నేట్టేయ్యమ్మా అని లోపల నుంచి ప్రాదేయపడతాడు. ఆ శిశువు యొక్క బాధను కన్యగా లేని మమకారాన్ని ఆ ఆడపిల్ల ప్రసవ వేదనలో తెలుసుకుంటుంది. తనకు జన్మనిచ్చిన తల్లిని ఒక్కసారి తలచుకుంటుంది , అమ్మా ఈ సృష్టి కోసం నువ్వెంత కష్టపడ్డావు నేను సృష్టికి ప్రతి రూపాన్నే కదా ! జన్మ కావాలని అడుగుతున్న'శిశువు ' తన దేహాన్ని కాపాడే భాద్యత నాది. ప్రసవ వేదనలోనే పుడుతుంది 'భాద్యత' . ఇద్దరు కలిసే ఆ శిరస్సు ను భూమ్మీదకు తీసుకు వస్తారు. శిరస్సు భూమ్మీద పడగానే దేహం లో చైతన్యం కలుగుతుంది. 'కేర్' మని గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపులో అర్ధాన్ని తెలుసుకుంటుంది. అది జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో ఆనందం లో కొట్టిన కేరింత. తల్లి ప్రస్థానం మొదలవుతుంది. మొదటగా తన సుఖ భోగాలను వదిలి పెడుతుంది. బిడ్డ యొక్క అసుద్దాన్ని తీసేయడానికి సంకోచించదు. ఎంతో ఆనందం తో చేసేస్తుంది. బిడ్డ తన చను మొనలను గట్టిగా లాగి గుంజుతున్నా బాధ తో భరిస్తుంది. బిడ్డ ఏడుపులోని అర్ధాన్ని వెదుకుతుంది. చిన్న చిన్న కాళ్ళ తో పాలు త్రాగుతూ పొట్ట లో తన్నుతున్నా తన ఆటలకు అడ్డు చెప్పదు సరిగ్గా తన ఆకలి తీర్చుకుంటుండగా బిడ్డ ఏడుస్తాడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాడి అవసరాలు తీరుస్తుంది , తనకి ఆకలేస్తుందన్న సంగతి కూడా మరచిపోతుంది. నిద్రాహారాలు మాని బిడ్డ కోసం పరితపిస్తుంది.

ఆ బిడ్డ పెరిగి పెద్దదై తల్లి చేయి వీడిన రోజులో ఒక్క సారి తల్లిని గుర్తు చేసుకుంటుందేమో కాని అదే తల్లి అను క్షణం తన బిడ్డలని తలచుకుంటునే ఉంటుంది. తను ముత్తల్లైనా తను తల్లి ఐన క్షణాలను మరచిపోదు, ప్రతి సారి అదే అనుభూతిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

భ్రూణ హత్యలను ఖండిద్దాం , ఆడపిల్లను ఆనందంగా ఎదగానిద్దాం, మనల్ని వీడిన మన బంధువులో లేక ఆత్మీయులో తిరిగి జన్మించేందుకు అవకాశాన్నిద్దాం.