Sunday, May 25, 2008

కడుపు నిండా మద్యం-తెలుగుదేశానికే ఓటు.

ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు ప్రచారసాధనాల్లో ప్రతి పార్టీ పాటలు, అబినయాలతో వినూత్నంగా ప్రచారం చెయ్యడం బావుంది. కాని తెలుగుదేశం పార్టీ ప్రకటన, ఒక వంతు నవ్వు తెప్పిస్తొంది నా మటుకు.

మనకందరికి సుపరచితమైన సినిమా మిష్టర్ పెళ్ళాం. ఆ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ భార్య ఆమని పని చేసే ఎం.డి. గోపాల క్రిష్ణ ని ఒకానొక పాట లో ఆటపట్టించిన సందర్భం గుర్తు వచ్చింది. ఆ పాట చివరిలో "గోపాల క్రిష్ణుడు పక్షి...గోవింద క్రిష్ణుడు పక్షి.." కోరుస్ అంతా కుడా పక్షి పక్షి అంటూంటారు .....ఎం.ఎస్ మొహం లో బాధ ఎక్కువైపోతుంటుంది..అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఆనందపడుతుంటాడు. చివరకి కాని చెప్పడు పక్షి వాహనుడై వెడలె అని. వాక్యాలని పూర్తి గా చెప్పాలి లేక పోతే అర్ధాలు మారిపోతుంటాయి

తెలుగుదేశం ప్రకటన లో కూడా ఇదే జరిగింది. సన్నివేశం ఎలా ఉంటుందంటె ఒక తాగుబోతు ఇంటికి తాగి వస్తాడు. భార్య అతన్ని ఉద్దేసించి, పిల్లవాడికి మందులు తెమ్మంటె నువ్వు మందు తాగి వస్తావా అని అడుగుతుంది?పిల్లవాడికి మందులు తెద్దామంటె దబ్బులేక ఆ బాధ లో ఈ మందు తాగనంటాడు ..ఆ సందర్భం లో వాడు "నీ తల్లి బెల్టు తీస్తా అంటాడు.."అందుకు భార్య ఈ సారి చంద్రబాబు నాయుడు వస్తే బెల్టు షాపుల మీదా బెల్టు తీస్తాడు అంటుంది. ప్రకటన లో భాగంగా ఇదెక్కడి ఖర్మ (ఇక్కడ ఉపిరి పీల్చుకునే అంత గాప్) కడుపునిండా మద్యం వెంటనే తెలుగు దేశాన్ని గెలిపించండి అని వస్తుంది . నేను ఈ ప్రకటన మొదట్లొ చివరి రెండు లైన్లు మాత్రామే విన్నా ..చాలా నవ్వు వచ్చింది తరువాత పూర్తిగా విన్నాక అర్ధమైంది. ఏ భాషకైన డిక్షన్ చాల అవసరం లేక పోతే ఇలాగే నవ్వుకోవలసి వస్తుంది.

ఇది తెలుగుదేశం పార్టీ భావాలని కించపరచడానికి రాసింది మాత్రం కాదు. నాకు ఇలా తోచింది అని చెప్పడానికి మాత్రమే. ..

Wednesday, May 14, 2008

గజేంద్ర మోక్షం లో ని పద్యాలు

boomp3.com

గజేంద్ర మోక్షం లో ని పద్యాలు

పోతానామత్యుల వారి చే ఆంధ్రీకరింపబడి వ్యాస భగవానుని విరచితమైన భాగవతం లో ని గజేంద్ర మోక్షం లో ని కొన్ని నాకిష్టమైన పద్యాలు.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతహ్ పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై


ఎవ్వని చేఁ జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె యైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో

(తెలుగు పెరంట్ వారికి కృతజ్ఞతలతో)

Tuesday, April 29, 2008

నీ కోసం ఎదురు చూస్తూ నీ...

తట్టి తట్టి లేపుతున్నట్టనిపించి లేచి చూసాను. ఆదివారం, సెల్ ఫోన్ లో సమయం 3గం.59ని.కావస్తోంది. ఎండాకాలం కాని బయట చల్లగా ఉంది. బహుశా ఇంకాసేపట్లో వర్షం పడబోతుందేమో. ఆరిన బట్టలు ఇంట్లోకి తెద్దామని బయటకు వెళ్ళబోతుంటే నిన్ను లేపింది నీ పనులు నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కాదు, నాతో కాసేపు అలా గార్డెన్ లో కూర్చొని వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? పొద్దున్నే వాకింగ్ వెళ్ళేప్పుడు మనిద్దరం నడిచేది అరగంటే అయినా ముందు రోజు జరిగిన విషయాలన్ని చెప్పేదానివి. మరి ఇప్పుడు ఆ అరగంట కూడా ఐపాడ్ లో విష్ణు సహస్రనామం వింటున్నావు. లేకపొతే నీ తోటి నడిచేవాళ్ళతో అమెరికా లో రిసెషన్ గురించో లేక పాకిస్ఠాన్ లో సరబజిత్ క్షమాపణ గురించో మాట్లాడుతున్నావు.నేనసలు నీకు గుర్తున్నానా? అందంగా వికసించిన ఎర్ర గులాబిని చూసి నువ్వేసిన కృత్రిమ ఎరువు గురించి మాట్లాడుతున్నావు. అరె, అదే అంతకు ముందు నాతో దాని అందాన్ని, దాన్ని సృష్టించిన ప్రకృతిని గురించి గంటలు గంటలు గడిపేదానివి. నీలో ఎందుకింత మార్పు?ఎందుకింత కృత్రిమంగా తయారయ్యావు? పెనం మీద దోసె వేసి దాన్ని తిప్పుతూ సెల్ ఫోన్ లో కష్టమర్ కేర్ వాళ్ళతో ముందు నెల్లో ఎక్కువ వచ్చిన బిల్ గురించి కొట్లాడతావు. కాణి ఖర్చు లేకుండా నాతో మాట్లాడ్డానికి నీకు ఒక్క నిమిషం లేదా ?అసలేంటి నీ యాంత్రిక జీవనం ? పెద్దగా పరిచయం లేని వాళ్ళని వీకెండ్ కి భోజనానికి రమ్మని ఫోన్ లో పిలుస్తావే ? వాళ్లేసే జోకులకి నీ నుంచి వచ్చేది ప్లాస్టిక్ స్మైల్ కాదా ?నిజంగ సహజంగా నవ్వి ఎన్ని రోజులైంది ? ఎక్కడికి నీ ఉరుకులు ,పరుగులు ? ఎవరి కోసం ?


పాపయి సీతాకోకచిలుకని చూపించి కేరితలు కొడుతుంటే దానికి సైన్స్ భోధిస్తావు లార్వా అని,ప్యుపా అని, కాటర్పిల్లర్ అని.. అంతే కాని అది దాని రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటే రంగులు రంగులు గా మారే దాని అందాన్ని చెప్పలేవా ? తేనె కోసం పువ్వు పువ్వు మీదా వాలుతు చేసే శబ్దాన్ని నిశ్శబ్దంగా వినమని చెప్పలేవా ? ఆ చిన్ని పాపయి బుర్ర నుంచి నువ్వు ఎమి శోధిస్తున్నావు ?

రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఆ దిండు కింద సెల్ ఫొన్ ఎందుకు ?అర్ధరాత్రి కనీసం నీ కల్లో అయినా మాట్లాడుదామంటే వినూత్నమైన రింగ్ టోన్ తో అమెరికా నుంచి వచ్చే యూసర్ కాల్ తో నువ్వు బిజీ.వాడిచ్చే డాల్లర్ల కోసం సమయం ఉదయం నాలుగు గంటల దాకా పని. ఆ వత్తిడి ని తగ్గించుకోవడానికి యోగా చేస్తావు ..ఎందుకు ?


కాఫీ అయ్యిందిగా రా అలా కాసేపు గార్డెన్ లో కుర్చోని మాట్లాడుకుందాం.నాతో అరగంట సేపు సమయాన్ని వెచ్చించు, నీ కృత్రిమమైన జీవితాన్నుంచి దూరంగా వచ్చి నాతో మమేకమవ్వు. నీ యాంత్రిక జీవనాన్ని ఉల్లాసంగా గడపగలవని నేను భరోసా ఇస్తున్నాను. నాకు సహనం, ఓర్పు ఎక్కువ నీకోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాను నేస్తం. నాలోని మనుసు మౌనంగా నిరీక్షిస్తోంది నాతో మాట్లాడ్డానికి. ప్చ్ ...నాలోని మన్సు తో మాట్లడలేకపొతున్నా, ఇది నాలోని హిపోక్రసి కాదా ? నాది కృత్రిమమైన జీవితమా ..ఎమిటి ఈ సంఘర్షణ???

Wednesday, April 16, 2008

రామయ్యా ..తేనేగూడు లో పొరపాటు జరిగిందయ్యా..

రామయ్య.. పొరపాటు జరిగిపోయిందయ్యా ..శ్రీ రామనవమి రోజు నిన్ను స్తుతిస్తూ భద్రాచలం లో అందంగా కొలువు తీరిన నీ ముఖచిత్రాన్ని అందరూ చూడాలనే ఆశ తో "చూచితిని సీతమ్మను రామా" (ఏప్రిల్ 14)అనే టపా ద్వారా అంతర్జాలం లో ప్రచురించాను. తేనేగూడు అనే బ్లాగుల సమాహారం లో బ్లాగు లో ని వ్యాసములను మూఖచిత్రం తో సహా చూపించే మొదటి పేజీ లో ఆ ముఖచిత్రం ఎలా వచ్చిందో మరి. సాంకేతిక కారణాలేలాంటివో నా చిత్తానికి నేను ఎరుగను. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో ..నా మనస్సాక్షిగా నేను ప్రచురించింది మాత్రం నీ ముఖచిత్రాన్నే ప్రభు. తప్పిదం జరిగిందనే ఆవేదనలో వారికి లేఖ కూడా వ్రాసాను. కాని ప్రత్యుత్తరం లేదు. ఎవరిని నిందించాలి అజ్ఞానపు అంతర్జాలాన్నా ? నీ ముఖచిత్రాన్ని వీక్షించలేని మా కన్నులనా..


నా మనవి ఆలకించు శ్రీరామ..నీవైనా చెప్పవమ్మా సీతమ్మా..

నా టపా కలిగిన లింకును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

http://www.thenegoodu.com/?which=50&cid=&mode=

Sunday, April 13, 2008

చూచితిని ..సీతమ్మను..రామా



కమలోధ్భవుడైన బ్రహ్మ ముఖం నుండి వేదం, వల్మికసంభవుడైన వాల్మికి మహర్షి ఘంటం నుండి శ్రీమద్రామాయణం పుట్టాయి. బ్రహ్మ చతుర్ముఖుడు, వాల్మీకి చతుర వచనుడు. బ్రహ్మ లోక విధాత, వాల్మీకి శ్లొక విధాత. వాల్మీకి చేత ఆ వేదం సాక్షాత్తుగా రామాయణమై వెలసినది.అందుకనే రామాయణాన్ని ఆది కావ్యము, వాల్మీకి ని ఆదికవి అని అంటారు. రామాయణ సమాసం సంస్కృతం లో "రామస్య అయనం" రాముని యొక్క చరిత్ర అని అలాగె రామాయ:అయనం అంటే ఇక్కడ రామా శబ్దం స్త్రీ లింగం అగుట చేత ,రామా అంటె సీత అనే అర్ధం కూడా వస్తుంది కనుక సీత యొక్క చరిత్ర అని కూడా అర్ధం వస్తుంది. రామాయణం కావ్యమే కాదు, ధర్మ శాస్త్రం కూడా. ఇందులొ పుత్రధర్మము, మిత్రధర్మము, బ్రాతృధర్మము, భర్తృధర్మము, శిష్యధర్మము అన్నిటిని కూడా రాముడు తను ఆచరించి లోకానికి మార్గదర్సకుడు అయ్యారు. పరసతులని ఆసించిన రావణడు, పులస్త్యబ్రహ్మ ఐన కుడా అపకీర్తి ని పొంది చివరికి అధోగతి చెందాడు.
రామయణం లో అన్నిటికన్న అత్యధ్భుతమైన వర్ణన సుందరకాండము. అసలు ఎందుకు "సుందర"కాండం అని పిలవబడుచున్నది ? ఈ లోకం లో బాహ్య సౌందర్యం , అంత:సౌందర్యం అని రెండు విధములు కదా ..భార్యభర్తలు ఆత్మీయతతో, ఆదరాభిమానలతో ఉన్నప్పుడు వారిద్దరు ఒకరికొకరు అందంగా కనిపిస్తారు. అలాగే వారి పిల్లకు మార్గదర్సకులైతే వాళ్ళు చాలా సౌందర్యవంతులుగా కనిపిస్తారు ..అలాగే ఇది ప్రకృతి యొక్క అతి సహజమైన సుందరం. కాని సుందరకాండ లోక సాధారణ స్థితికి భిన్నంగా అత్యద్భుతమైన సౌందర్యం కలిగినది అందుకే "సుందర"కాండ అయ్యింది.

సుందరె సుందరో రామ: సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీత సుందరే సుందం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

పురషమోహనాకారుడు, సుగుణగణ సుందరుడు శ్రీరాముడు, సర్వ విధములా భువనైక మాత సీతా దేవి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమసుందరుడు. అశోకవనం అతిలోక సుందరం. శ్రీ సీతరామహనుమంతుల మంత్రములు దివ్యములు సుందరములు. ఈ మహితాత్ముల కధ సర్వాధ్భుత సుందరం. ఈ సుందరకాండ కవిత్వం అత్యంత సుందరం. కనుక ఈ సుందరకాండమునందు సుందరం కానిదేది? సర్వమూ సుందరమే. ఇందు హనుమంతుని చే సీతారాముల వర్ణన అద్భుతము గా చెప్పబడినది.

హనుమంతుని ప్రతిభ ::

హనుమంతుడు జితేంద్రియుడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు, వాయు సుతునకు ఏకైక లక్ష్యం. ఒక స్త్రీ ని స్త్రీ ల మధ్యనే వెదుకుట ,అదియును అర్ధరాత్రి వేళ రావణుని ఏకాంత మందిరమున అతని కాంతల మధ్య వెదుకుట , హనుమంతుని యొక్క నిశ్చల బుద్ది కి జితెన్ద్రియత్వమునకు నిదర్సనం.సుందరీ సుందరుల గాధను తెలుపునది సుందరకాండము. సుందరకాండము సాధకుని లో పరమాత్మ యొక్క అంశ శ్రీరాముని తో ప్రకృతి అంశ అయిన సీతమ్మను కలుపుటకు హనుమంతుడు చేసిన "అన్వేషణే ". ఆంజనేయుడు అనగా బుద్ది యోగము.

సుందరకాండ గురించి మా తెలుగు ఆచార్యులు చెబుతుంటే అద్భుతంగా ఉండేది. అందులో హనుమంతుడు లంక నుండి తిరిగి రాముని దర్సించగానే "దృష్టా దేవితి" అంటే చూచితిని సీతను అని అర్ధం వస్తుంది.ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న రామునికి ఈ ఒక్క చిన్న మాట ఆయనుకు ఉపసమనం ఇస్తుంది , ఆ వర్ణ న అద్భుతంగా చెప్పేవారు. లంకా అనే పదాన్ని తిరగ రాస్తే కాలం అనే అర్ధం వస్తుందని , కాలం అనె పదానికి నలుపు అనే అర్ధం వస్తుందని, నలుపు అంటె తమో గుణానికి కారణమని, దానికి బుధ్ధి కి ప్రతీక అయిన హనుమంతుడు పూర్తిగ దహించేట్లు చెయ్యడం లో అర్ధం , మనలోని తమో గుణాన్ని , సరైన బుద్ది తో దూరం చేసుకొవాలని ఎంతో చక్కగ చెప్పేవారు.

రామాయణాన్నిపూర్తిగా చెప్పే లవకుశ లో ఈ పాట నాకెంతో ఇష్టం..

(యూట్యూబ్ మరియు గీతా ప్రెస్స్ వారి సౌజన్యం తో )

Friday, April 11, 2008

ఆహా ఏమి రుచి ..

"శాకంబరి దేవి ప్రసాదం...ఆంధ్ర శాఖం ..గోంగూర " ఈ మాటలు అందరికి సుపరిచితమైన వే ...అదేనండి అల్లు రామలింగయ్య మాయాబజార్ లో అన్నమాటలు ..మహాభారతం లో పిట్టకద లాంటి మాయాబజార్ లో కూడా గోంగూర గురించి ప్రస్తావించి దాని మీద తన ఇష్టాన్ని , ఆంధ్రుల మీద అభిమానాన్ని, చతురతని చాటుకున్నారు పింగళి గారు. ఏది ఏమైనా విందులో మాత్రం గోంగూర స్టేటస్ వేరు. . గోంగూర తో నా అనుభందాలను నెమరు వేసుకోవాలనిపించింది ఒక్క నాకేమిటి ఆంధ్రుడైన ప్రతి ఒక్కరి కి గోంగూర అనగానే ఏదో ఒక అనుభూతి తప్పకుండా ఉండనే ఉంటుంది. నా మటుకు గోంగూర అనగానే లాలాజలం ఊరిపోతుంది . దాన్ని ఆపడం ఒక్క గొంగూరకే సాధ్యం. వేడి వేడి అన్నం లో గోంగూర పచ్చడి ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటుంటే ఒహ్ ...వర్ణించడానికి మాటలు చాలవు ..

పాపం గోంగూర కి కుడా తప్పలేదు ప్రాంతీయతా భావం. గుంటూరు గోంగూర కి మిగతా ప్రాంతాల గోంగూరకి చాల తేడా ఉందని ఎప్పడు గోంగూర తిన్నాదాని మీదో టాపిక్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది మా ఇంట్లో. మా మామయ్యా గారైతే ...వాళ్ల బామ్మగారు రాచ్చిప్పల్లో గోంగూర పులుసు వండే విధానం , మూడు రోజులైనా పాడైపోకుండా ఉండేదని తలచుకుంటునే ఉంటారు .. గోంగూర తింటున్నప్పుడల్లా....!!!అంటే దీని పర్యవసానం గొంగురాభిమానమనేది తర తరాలదన్నమాట. ఇప్పటిది కాదు.

ఇక కార్తిక, మార్గశిర మాసాల్లో ఐతే మా పాలేరు ఏమి తెచ్చిన తేకపోయిన గోంగూర , పచ్చిమిరపకాయలు మాత్రం ఠంచనుగా తెచ్చేసేవాడు .. ఆ పొలం గట్ల మీద దొరికే గోంగూర అంత ఫ్రెష్ గా ..ఫ్రెష్ ఫ్రెష్ అని చావగొట్టె రిలయన్స్ ఫ్రెష్ లో నేను ఎప్పుడూ చూడలేదు ..కాని ఆ ఫ్రెష్కి వెళ్ళినప్పుడు సరుకుల్లో భాగంగా ప్రియమ్మ (అదేనండి ప్రియ పచ్చడి ) తయారు చేసే పచ్చడి కుడా చేరిపోతుంది .మా అమ్మగారు చేసే పచ్చడిని తలచుకోవడం ,ప్రియమ్మ పచ్చడి ని తిట్టుకోవడం ..ఆఖరికి సీసా ఖాళీ చెయ్యడం పరిపాటే ..ఇన్ని సంజాయీషీలు ఎందుకు నువ్వే చేసుకోవచ్చు కదా అని కూడా అడుగుతుంటారు ..బద్దకించి మాత్రం కాదు, ఎందుకంటే మేముండేది ఆంధ్రాకి నాలుగు గంటల దూరమే అయిన ఇక్కడ(మద్రాసు లో)గోంగూర దొరకడం కష్టం .

గోంగూర మీద ఆశ కొంత మందిని దొంగలుగా కుడా మార్చేస్తుందండి. ఇది నిజ్జంగా నిజ్జం ..ఆ మధ్య మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది..ఇక ఆ కార్యం లో గోంగూర ఉంటే వచ్చిన వాళ్లు కూడా సంతోషిస్తారు కదా ..అని వంట వాళ్ళని పురమాయించారు మా అమ్మగారు ..అదేంటో గాని ఆ రోజు వంటవాళ్ళు అద్భుతంగా చేసారు గోంగూర పచ్చడి . మొదటి బంతి లో నే కూర్చున్న తెలిసిన ఆవిడ ఒకరు పెరట్లో కి వెళ్లి ఎవరు చూడకుండా గోంగూర పచ్చడి డబ్బాలో పెట్టుకు పోయారట ..ఆ విషయం ఈ మధ్య మా వంట మనిషి చెబితే విని ఆశ్చర్య పోయా ..గోంగూర పచ్చడి పాపం మనుషులని దొంగలు గా కుడా మారుస్తుందని నవ్వుకున్నా ... మా నాన్నగారు చనిపొయే ముందు రోజు చివరి సారి గా కలిసి భోంచేసినప్పుడు గోంగూర పచ్చడి ఉండడం కూడా యాదృచ్చికమేమో..

Monday, April 7, 2008

అదే నీవు.. అదే నేను


నిన్ను చూడకుండా తెల్ల వారేది కాదు,
నా కనురెప్పల కాటుక కళ్ళ అందాన్ని నీలో చూసుకుని మైమర్చిపోయాను.
నా నుదుటన కుంకుమ తిలకాన్ని చూసి ఉషోదయ సూర్య బింబం లా ఉందన్నావు,
చిక్కుముళ్ళు పడిన నా కురులను క్షణాల్లో సరి చేసావు,
నేను వోణి వేసుకుంటే, నువ్వు పదహారణాల తెలుగమ్మాయి లా ఉన్నానన్నావు,
చీర కట్టులో స్త్రీ అందాన్ని చూపించావు,
అప్పట్లో అమ్మ తిడుతున్నా నీతో నే కాలక్షేపం చేశాను,
ఇప్పట్లో నిన్ను చూడాలంటేనే నాలో విరక్తి,
అదే నీవు, అదే నేను, కాని మనిద్దరి మధ్యా ఎందుకింత దూరం..?
నిజాలను నిర్భయంగా చెప్పగల నిలువుటద్దానివి నీవు ,
తరిగిపోయిన నా అందాన్ని వార్ధక్య రూపం లో చూపిస్తున్నావు
అందుకే నువ్వంటే నాకు విరక్తి ,
అందుకే మనిద్దరి మధ్యా ఇంత దూరం.

Thursday, April 3, 2008

అపురూపమైన కానుక.


అప్పటి దాకా పట్టు పరికిణి వేసుకుని పేరంటానికి నేను వస్తాను అని గొడవ చేసే చిన్నారి ప్రౌఢ వయసు రాగానే నేను రాను ఇంట్లో నే ఉంటాను అంటున్న కూతురుని చూసి కలత చెందింది ఆ తల్లి మనసు. ప్రకృతి సిద్దమైన తన లో ని మార్పులకు విస్తుపోయిందా చిన్నారి . మేనమామ చేతుల మీదుగా తోలి సారె అందుకుని మురిసిపోయింది. ఆడుతూ,పాడుతూ తిరుగుతున్న ఆ చిన్నారికి బామ్మగారి మాటలు చెవిన పడ్డాయి. ఎంతైనా 'ఆడ'పిల్లనే కదా అని కన్నెమనసుకి సర్ది చెప్పుకుంది. ఆ యవ్వనవతిని ఘనంగా సారెనిచ్చి అత్తవారింటికి సాగనంపి కన్యాదాన ఫలం దక్కించుకున్నాడా తండ్రి. శ్రావణాల పౌర్ణమిని తలచుకుని రక్తభందాన్ని నూలు దారాలుగా పంపిన ఆ చిన్నారి చెల్లికి, దీవెనలు కానుకల రూపం లో పంపారా తోబుట్టువులు. ప్రకృతి కి ప్రతిరూపమైన ఆ కాబోయే తల్లిని సీమంతం చేసి పురిటింటికి సాగానంపారా అత్తవారు. ప్రకృతి పరవసించిపోయింది.
కూతురుగా, చెల్లిగా, కోడలిగా, భార్యగా, తల్లిగా తన వారినందరిని మరపింప చేస్తున్న ఆడపిల్లకి సమాజం లో ఈసడింపులు, పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, అత్యాధునిక పరిజ్ఞానం తో తన తొలి ఊపిరినే ఆపెయ్యడం. ప్రకృతి కే ఇది అమానుషం.
ప్రకృతి అపురూపమైన కానుక ఆడ జన్మ. జన్మ,జన్మ ల కి ఆడజన్మే కావాలని కోరుకునేట్లు పరివర్తన చెందుదాం


రష్యా జానపద కధ తెలుగు అనువాదం

అల్యోనుష్క మరియు సోదరుడు ఇవానుష్క.

ఒకానొకప్పుడు , అందమైన ప్రదేశం లో, ఒక అక్క, తమ్ముడు, నడచుకుంటూ వెళ్తున్నారు. వారి పేర్లు అల్యౌనుష్క మరియు ఇవానుష్క. వారు అలా నడచుకుంటూ చాల దూరం వెళ్తుండగా వారికీ ఒక గొడ్ల చావిడి లో పశువుల కోసం వుంచిన నీరు కనిపించింది "అక్కా ,నేను ఆ నీరు తాగుతా" అడిగాడు చిన్న వాడయిన ఇవానుష్క. "వద్దు , నువ్వు దూడలా మారిపోతావు " అని అనింది అల్యోనుష్క. దాహంగా ఉన్నా, ఇవానుష్క అక్క మాటలకు సరేనన్నాడు. వారు అలా కొద్ది దూరం వెళ్ళగా వారికి ఒక గుర్రపుశాల లో గుర్రాల కోసం ఉంచిన నీరు చూసి దాహంగా ఉన్నఇవానుష్క నీరు తాగుతానని అడిగాడు అల్యోనుష్క ని. అవి తాగితే గుర్రపు పిల్లలా మారిపోతావు వద్దు అంటుంది. ఈ సారి కుడా సరే అన్నాడు ఇవానుష్క. అలా వెళ్తుండగా వారికి మేకల కోసం ఉంచిన నీరు కనిపించింది. దాహాన్ని ఆపుకోలేని ఇవానుష్క , అక్క వారిస్తున్నా వినకుండా ఆ నీరు తాగేసాడు ఇవానుష్క. తాగిన మరు క్షణమే చిన్న మేక పిల్లలా మారిపోయిన ఇవానుష్క ని చూసి విలపిస్తుంటుంది అల్యోనుష్క. అటుగా వెళ్తున్నఒక వర్తకడు జరిగింది తెలుసుకుని , తనని పెళ్లి చేసుకుంటే నువ్వు , మేక పిల్లలా మారిన నీ తమ్ముడు సంతోషంగా నా తోటే ఉండచ్చు అని చెప్తాడు.
అలా కొద్దిరోజులు సంతోషంగా గడుపుతుండగా ,ఒక రోజు , ఒక మంత్రగత్తె అల్యోనుష్క ని మాయ చేసి , నది ఒడ్డు కి తీసికెళ్ళి మెడకో రాయి కట్టి నీటిలో తోసేసి , అల్యోనుష్కలా మారిపోయి , సంతోషంగా వర్తకుడు తో కలిసి ఉంటుంది. పాపం, మేక పిల్లలా మారిన ఇవానుష్క కి మాత్రమె అసలైన నిజం తెలుసు. ఒక రోజు నది దగ్గర అల్యోనుష్క తో మాట్లాడటం చూసిన ఇవానుష్క తననని కుడా ఏదో చెయ్యాలని కుట్ర పన్నుతోందని అనుకుంటాడు .
అల్యోనుశ్క రూపం లో ఉన్న మంత్రగత్తె, మేక పిల్ల లా మారిన ఇవానుష్క ని చంపెయ్యమని చెప్తుంది వర్తకుడి . అది తన మనసుకి,కష్టం అనిపించినా భార్య రూపం లో ఉన్నమంత్రగత్తె మాటలను వింటాడు వర్తకుడు.
చంపేముందు చివరి సారిగా మంచి నీళ్లు తాగడానికి నది దగ్గరికి తీసుకు వెళ్ళమని అడుగుతాడు మేక పిల్ల రూపం లో ఉన్న ఇవానుష్క . అక్కకి తన పరిస్థితి చెప్పుకుంటాడు. తన మెడ కి రాయి కట్టుందని , ఇప్పుడు తను ఏ విధంగాను సహాయం చెయ్యలేనని చెప్తుంది.
అక్కడే ఉన్న గొడ్ల కాపరి వారిద్దరి సంభాషణ వినడం అక్క, తమ్ముళ్ళూ గమనించలేదు.
వర్తకుడి కి జరిగింది వివరిస్తాడు కాపరి. వర్తకుడు, పరిగెత్తుకుంటు వచ్చి నది లో ఉన్న అల్యొనుష్క ని బయటకి తీసుకు వచ్చి , మెడ కి కట్టి ఉన్న రాయి తీసి పారేస్తాడు.
మంత్రగత్తె ని పట్టుకుని, మదమెక్కిన గుర్రానికి కట్టెసి , గుర్రాన్ని వదిలేస్తారు. అది పొలం లో పిచ్చి గా అరుస్తూ , మంత్రగత్తె ని ఈడ్చుకుని పోతుంది. ఇవానుష్క కి తన మేక పిల్ల రూపం పొయి తిరిగి మాములుగా మారిపోతాడు. ఆ తరువాత ముగ్గురు సంతోషంగా కాలం గడుపుతుంటారు.

Tuesday, April 1, 2008

స్నేహితుని కై అన్వేషణలో ...

అప్పుడప్పుడె స్నేహితుని కోల్పొయిన క్షణాల లో ఉండగా తిరిగి అతనిని చూసాను.
అంత మంది లొ మిరుమెట్లుగొల్పుతు అతని కండ్లు, గుచ్చి గుచ్చి చూసే అతని చూపులు నా దృష్టి ని మరల్చాయి. అతను తిరిగి మళ్ళి నన్ను చేరాలనే ప్రయత్నం.
ఎక్కడికి వెళ్ళినా నన్ను నీడలా వెంబడించే ఆ భయంకరమైన రోజులన్ని గుర్తుకు వస్తున్నాయి.
నేను ఒంటరిగా ఉన్నా లేక పది మందిలో ఉన్నా అతను లెక్క చేసేవాడు కాదు. చాల సార్లు అతని చూపులనుంచి తప్పించుకోవాలని నాకు నేను గా సమయాన్నంతా పుస్తకాల లో నో లేక సంగీతం వినడం లో నో గడిపే దాన్ని. కాని నా ఆలోచనలన్ని నేను ఊహించని విధంగా అతని చుట్టూ పరిభ్రమిస్తుండేవి. ఇక అతను నా కలల్లో కుడా నన్ను వేటాడుతుండే వాడు.
అతన్ని చూస్తే నాలో చెప్పలేని భయం.
అతనంటే రోజు రోజు కి ద్వేషం, ఇప్పుడు నాకు అతనో పరమ శత్రువు.
అతనంటే రోజు రోజు కి నా లో భయం పెరిగి పోతోంది.
ఇక అతని ఆలోచనల వెనక పరిగెత్తడం మానేసాను. కొత్త పరిచయాలు, స్నేహాల్లో అతన్ని మర్చిపోదామని ప్రయత్నించాను. అవి అన్ని నిర్వీర్యమైపోయాయి. అతను నా చుట్టూ ఉన్నప్పుడు ఉన్న క్షణాలని తల్చుకుని బిగ్గరగా ఏడ్చాను. భగవంతుడా నాకో మార్గం చూపించమన్నాను. మరు క్షణం ధైర్యం తెచ్చుకుని నేనే అతని దగ్గరకి వెళ్ళాను. నా చేతులు జోడించి అతనిని స్నేహితుని గా ఆహ్వానించాను. ఇప్పుడు అతను నాకు ఓ మంచి మిత్రుడు గా మారిపోయాడు. నాకేలాంటి సమస్యలు లేవు. మొదట నుండి అర్ధం చేసుకోవడం లో నేనే తప్పు చేసానేమో, అతన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాక, చాల మంచివాడనిపించింది. అతనితో స్నేహం నాలో ఉన్న ద్వేషాన్ని, కసిని దూరం చేసింది. ఇప్పుడు మాది విదదీయరాని స్నేహం. అతను ఎవరో కాదు నాలొ ఉన్న ఒంటరితనం. అతనే నాలోని ఒంటరి.

Sunday, March 23, 2008

మా తెలుగు తల్లికి మంగళారతులు


మా నాన్న గారు కీ.శే. దుత్తలూరు రాధాక్రిష్ణ మూర్తి(రిటైర్డ్ ఎక్సికుటివ్ ఇంజినీర్) గారికి నివాళులర్పిస్తు , ఆయన కలం నుండి జాలు వారిన చివరి రచన.


గల గల పరుగునిడుతున్న మన గోదావరి పెద్దమ్మ,
రాజమహేంద్రి ఆనకట్ట పొరలి సంద్రయ్య పెద్దయ్య
చెంత చేరక ముందే చురలి, తరలి తన చెల్లి
మన అమ్మ తెలుగులమ్మ ఇంటికి, విజయవాటికి
మెట్టినింటికి పోకనే నల్లనమ్మ,గంగమ్మ మన అమ్మ, క్రిష్ణమ్మ
సాగర్ వద్ద ఆగి తన అయ్య కొండయ్యనడిగి,
కొండ దిగి, సంగమయ్య మిట కొండ పటిలములో నుండి కుందులో కలిసి కడప కు వచ్చి,
ఉరవళ్ళ పరవళ్ళ మన పెన్నమ్మ పిన్నమ్మ చేయి పట్టుకుని ఒంటిమిట్టకు కోందండ వారధి పరుగునాపి
భాగవతము పోతయ్య సాక్షిగా కోదండ రామునికి కోదండము వేయించి
సోమశిల వద్ద పిన్నమ్మ సేవదీరమని రంగనాయకుని పలకరించి
నూరేళ్ళుగా నెల్లూరు నెరజాణలనోచిన నోముల పంట,
నెల్లూరు పిషాణముల పంటనినిటికి చేర్చి
పల్లె పల్లె వాడ వాడల పల్లెపడచుల
వెల వెల బారిన నీటి బిందెల తళ తళ లాడించి వారి మోముల కళ కళలా మెరిపించి
కొదండ రాముని కో దండము పెట్టి,
తన పుట్టినిల్లు తిరుమలన్న వెంకన్న పాదముల వద్ద నాగి ,
అన్నకు ఉపచార అర్ఘ్య, పాద్య,స్నాన పానాదుల గూర్చి
మన తమిళ తమ్ముడింట పయనించి దప్పి తీర్చిన మన తెలుగులమ్మ క్రిష్ణమ్మకు, మా అమ్మకు,
ముచ్చటగా మా ముగ్గిరి అన్నల ముద్దులమ్మ తెలుగులమ్మకు మంగళారతులు .....
మా తెలుగు తల్లికి మంగళారతులు...

Wednesday, March 19, 2008

చేతిలో చెయ్యి వేసి చెప్పనా...

జననం-పెండ్లి-మరణం జీవితమనే కాల చక్రంలో ఈ మూడు ప్రస్థానాలు అనివార్యం. ఈ మూడు అనుభూతులని ఏక కాలం లో ఒకే హౄదయం అనుభవించిన ఆ క్షణాలు మరిచిపోలేనివి....

అప్పుడే పుట్టిన చిన్నారి చేతిని చెయ్యి లో తీసుకున్నప్పుడు నీ వెనకలా నేనున్నాననే భరోసా, ఆ చిన్నారిని చూస్తుంటే ప్రపంచమంతటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ ఒక్క చెయ్యి చాలెమో, సంతోషంతో నిండిన హౄదయం, ఆ హౄదయ స్పందనకి కళ్ళు చెమ్మగిల్లి ఆర్ధృతతో హత్తుక్కున్న వైనం. ఆ అనుబంధం అద్వీతియం.

కల్యాణ ఘడియలు , పాణిగ్రహణ మంత్రాలు , చేతిలో చెయ్యి వేసి నీకు నేనున్నాను, ఈ ప్రపంచమంతా మనిద్దరమే అంటున్నట్లున్న ఆ బంధం అజరామరం ..

కొన్ని విఘడియలలో ఇంత ధైర్యాన్ని ఇచ్చిన ఆ చెయ్యి ఈ బంధాలన్నిటిని కాదనుకొని వెళ్ళిపోతున్నా, అయినా తిరిగి మళ్ళి నీకోసం జన్మిస్తానని చేతిలో చెయ్యి వేసి వెళ్ళిపోయినప్పుడు, భారంతో నిండిన హౄదయం, ఆ హౄదయ వేదనని ఆపడానికి మనసు పడె కన్నీళ్ళ ప్రయాస.

ఇన్ని ఆవేదనానందాలలో చేతిలో చెయ్యి వేసి దగ్గరికి తీసుకునే ఆ భగవంతుని కరుణ అమోఘం.

Sunday, March 16, 2008

ఫుష్ప విలాపం

కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది....

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా
మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కర్మ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భౄం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
ట్ళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు

గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరురో జుద్యాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కౄశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను.


Get this widget | Track details | eSnips Social DNA

Thursday, March 13, 2008

ప్రయత్నిచండి...చూద్దాం ..

ప్రయత్నిచండి...చూద్దాం ..

ఈ పదప్రయోగాలని గబ గబ పలికి చూడండి..మన లో మనమే ఆనందించగలం.

1.లక్ష భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్య కుక్షికొక భక్ష్యం లక్ష్యమా.

2. కాకీక కాకికి కాక కుక్కకా

3. నా నాన్న నూనె నా నాన్న నూనె నీ నాన్న నూనె నా నాన్న నూనెనని నే నన్నానా

4. ఏడు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు.

5. గాదె కింద పందికొక్కు గాదెలోన పందికొక్కు .

మీలొ ఎవరికైనా ఇలాంటి పదప్రయోగాలు తెలిస్తే, వ్యాఖ్యల(Comments) ద్వార తెలియజేయండి.

Wednesday, February 6, 2008

స్వర మాంత్రికుడు--ఇళయరాజ.

స్వరం అనగానే మనకు స్పురించేది సంగీతం ...తెలుగు లో మాత్రమే లభించే దీని అర్ధం ..."స్వ"యముగా "రం"జింప జేయునది.... ఇది ముమ్మాటికి సరైనదని మనకందరికి తెలిసిన విషయమే. ప్రముఖంగా సప్త(7) స్వరాలుంటాయని,ఈ సప్తస్వరాల మేళవింపే సంగీతానికి ప్రాణమని, అందరకి విదితమే. "స,రి,గ,మ,ప,ద,ని" ల ఆరోహణ,అవరోహణలు, వాటి యొక్క మేళవింపు ఎంత క్లిష్టంగా ఉంటే సంగీతం అంత బావుంటుందనే భావనకి విరుద్దంగా స్వర మాంత్రికుడు దక్షిణాది ప్రముఖ సంగీత దర్సకుడు ఇళయరాజ ఈ మధ్య తమిళనాడు లో చేసిన స్వర విన్యాసం నన్ను అబ్బుర పరిచింది. మూడే మూడు స్వరాలు "స","రి","గ" తో ఆయన చేసిన స్వరేంద్రజాలం మీ కోసం ఇక్కడ....

Tuesday, February 5, 2008

తెలుగు పరిపక్వతా లేక రూపాంతరమా ??

ప్రొద్దున్నే ఫిల్టర్ కాఫీ, చేతిలో సమాచార పత్రిక, రేడియో లో సంస్కృతం పాఠాలు...ఇవి ప్రొద్దున్నే నా అలవాట్లు. సాంకేతిక మార్పులు మూలంగా కొన్ని రూపాంతరాలు చోటు చేసుకున్నాయి. రెండు గిన్నెల స్టీల్ ఫిల్టర్ కి బదులు, విద్యుత్ ఫిల్టర్, రేడియో కి బదులు టి.వి.... నా అలవాట్లు మాత్రం అవే..కాని సంతృప్తి కూడా రూపాంతరం చెందుతోంది. సరే ఇంక సమాచార పత్రిక చదువుదామంటే, ప్రాశ కోసం పాటుపడుతూ తాటికాయంత అక్షరాలతో ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం ఒక్క చోట లేక మిగిలిన సమాచారం కోసం ఎక్కడో 11 వ పుటలొ వెతుక్కోవడం...పొద్దున్నే విసుగ్గా అనిపిస్తుంది ...సరే టి.వి. చూద్దామంటె ఇంగ్లీష్ లాంటి తెలుగు తో వత్తులు, దీర్ఘాలు, పొల్లులు, హల్లులు లేక వయలు, హొయలు పోతు మాట్లాడే తెలుగు వినలేక సాంకేతిక రూపాంతరం చెందిన అలవాట్లతో తిరిగి నా దైనందిన పనులతో మర్చిపోవడం పరిపాటైపోయింది.

ఆ మధ్య నేను అంతర్జాలం లో ఒక బ్లొగ్ లో తెలుగు,ఇంగ్లిష్ కలిసి తెంగ్లిష్ అని ఒక క్రొత్త భాష వచ్చినట్టు చూసి తెలుగు పరిపక్వత చెందిందా లేక రూపాంతరం చెందిందా అని అనిపించింది. దీనికి తార్కణంగా ఒక రోజు టి.వి. లో ఒక కార్యక్రమం లో భాగంగా ఫోన్ లో జరిగిన సంభాషణ విని తెంగ్లిష్ భాష పైత్యం అనిపించింది...ఆ సంభాషణ టూకిగా ...ఒక ఉపాధ్యాయుడికి, జాకిలని పిలవబడె టి.వి వ్యాఖ్యాతకి మధ్య జరిగింది.

జాకి :: మీరు ఉపాధ్యాయులు కాబట్టి మిమ్మల్ని "సర్" అని పిలుస్తున్నాను..

ఉపాధ్యాయుడు:: నన్ను పేరు తో పిలవవచ్చు. "సర్" అనేది ఇంగ్లిష్ పదం కదా,పైగా నేను వయసులో చిన్నవాడినే.

జాకి :: సరేనండి మీరు గౌరవమైన వృత్తి లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని తెలుగు లో "మాస్టారు" అని అంటాను ఎమంటారండి "మాస్టారు" అని ....


ఇలా జరుగుతున్న వారి సంభాషణ విని తల పట్టుకోవల్సివచ్చింది.... మాస్టారు అనేది తెలుగు పదమని చెప్తున్న నేటి యువతరం తెంగ్లిష్ కి నా జొహార్లు .....మీ కరతాళ ధ్వనులు ....

Thursday, January 17, 2008

జ్ఞాపక శక్తి కి ప్రశంస

రష్యా జానపద కధ వ్రాస్తుంటె నా మస్తిష్కం లో నిగూఢమైన నా జ్ఞాపక శక్తి ని ప్రసంశించుకోలేకుండ ఉండ లేక పోయాను. దాదాపు 10 ఏళ్ళ నాడు చదివిన కధలు నా జ్ఞాపకశక్తి పుటల్లొ అంత పదిలంగ పాత్రధారుల పేర్ల తొ సహ ఎలా ఉండిపొయిందొ అని , ఇది ఇంతకి నా జ్ఞాపక శక్తా లేక ఆ కధ పసి హ్రుదయం లో పాతుకుపోయిన వైనమా అనిపిస్తోంది.కాని నిజానికి పసితనం , బాల్యం మన జీవితాల్లొ చెరగని ముద్ర వేసుకొంటయేమో అంటె అతిశయొక్తి కాదేమో. కొన్ని కొన్ని యదార్థ సంఘటనలు, కధల యొక్క ప్రభావం పసితనం లో నే నాంది వేసుకుంటాయేమో.వాటి వల్లనే మన నడవడిక కుడా ఆధారపడి ఉంటుంది అని కూడా అనిపిస్తోంది. దాదాపు 3వ శతాబ్దం లో విష్ను శర్మ సంస్క్రుతం లో రచించిన "పంచంతంత్ర నీతి కధలు" ఈ రోజుకి మనం చిన్న పిల్లలకి చెప్పడం లోని భావం అదే కదా. ఆ కధలు చిన్న పిల్ల ల భవిష్యత్తు మీద ఎంతగా ప్రభావం చూపుతోందో, మనకి ప్రత్యక్షంగ తెలిసిందే కదా. ఈ సాంకేతిక రంగం లో వచ్చిన మార్పు పిల్లల్ని టివి ల కి ఆకట్టుకునేలా చేస్తున్నాయి. అలాగే వాటిల్లొ చూపించే కక్ష, పగ లు తో కూడుకున్న కొన్ని పాశ్చాత్య కధలు చిన్నపిల్ల ల భవిష్యత్తు పై ఏ విధంగ ప్రభావం చుపుతుందొ అని కించిత్ భయం కుడా వేస్తోంది.
ఆ మధ్య నేను చిన్న పిల్లల కోసం బొమ్మలు కొందామని ఒక పెద్ద బొమ్మల దుకాణానికి వెళ్ళాను. అక్కడ చూసిన దాదాపు అన్ని బొమ్మలు పాశ్చాత్యపు పోకడల తో భీతి ని కొల్పేవి గా ఉన్నాయి. పైగా ఆ బొమ్మలు అరోగ్యానికి హానికరమైన రసాయనాల చే తయారు చేయబడినవి. పిల్లలు కుడా అవే కావాలని పట్టుబట్టడం..ఇవన్ని చూస్తుంటే వారి భవిష్యత్తు ని ఎలా ప్రభావితం చెయ్యగలదో అని కొంచెం బాధ వేసింది. వాటి మోజు లో పడి పిల్లలు మన ఇతిహాసాల్ని, పురాణాల్ని మర్చిపోవడం కూడా సహజమే కదా. కొంతమంది భవిష్యత్తుని దౄష్టిలో పెట్టుకుని ఇప్పటికే మన పురాణాల్ని టివి ల్లో చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ప్రొత్సహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే తరుణం లో ఈ మధ్య విడుదలైన "ది హనుమాన్ రిటర్న్స్" అనే సినిమా పిల్లల బొమ్మల పై బాగ ప్రభావం చూపింది. పిల్లలందరికి ఇప్పుడు హనుమాన్ గధలు, హనుమాన్ రంగుల పుస్తకాలు, హనుమాన్ పెన్సిల్ పెట్టెలు ఇంక బొలెడన్ని హనుమాన్ రూపం లో ప్రత్యక్షమవుతున్నాయీ...అలాగే వాటి పై మోజు ...ఇవన్ని చూసిన నాకు నాలోని బాధకి కొంచెం ఉపసమనం అనిపించింది. ప్రయత్నిస్తే మన పిల్లల్ని పాశ్చాత్య ధోరణి నుంచి దూరంగ ఉంచవచ్చెమో...

Wednesday, January 9, 2008

రష్యా జానపద కధ (తెలుగు అనువాదం)

నా చిన్నతనం లో రష్యా వారి చే తెలుగు లొ ముద్రించబడిన పుస్తకాలు తక్కువ ఖరీదు లొ విరివిగ దొరికేవి.అలా అప్పుడు ఒక రెండు కధల పుస్తాకాలు మా ఇంట్లొ ఉండేవి నా సెలవు దినాల్లొ కనీసం ఒక్కసారైన చదివేదాన్ని.ఆందులొ మొదటిది " మాయ గుర్రం మేటి గుర్రం " రెండవది " మత్స్య మిత్రుడి మంత్ర మహిమ "
మాయ గుర్రం మేటి గుర్రం
ఒక ఊరులొ ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కి నలుగురు కొడుకులు, నలుగురి లొ నాలుగవ వాడి పేరు ఇవానుష్క. ఆంతా వీడిని వెర్రి వెంగళాయ ఇవానుష్క అంటుండేవారు.ఒక రోజు రైతు నలుగురు కొదుకులను పిలిచి తమ పొలం లోని మొక్క జొన్న పంటని ఎవరో రాత్రి వేళలో నాశనం చేస్తున్నట్టు తెలుసుకుని అది ఎవరు చేస్తున్నారో తెలుసుకొమ్మని చెప్తాడు.సరే మొదటి వంతుగ పెద్ద కొడుకు పొలానికి వెల్తాడు. పొద్దున్నె తిరిగి వచ్చి ఎవరు రాలేదు అని చెప్తాడు. కాని ఆ రొజు పొలం లొ పంటని ఎవరో తొక్ఖినట్టు తెలుసుకుని రెందవ కొడుకు ని వెళ్ళమంటాడు రైతు. సరె రెందవ కొడుకు కూడా ఏమి తెలుసుకొకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇక మూడవ కొదుకు కూడా తెలుసుకో లేక పోతాడు.ఆఖరి వంతుగ వెర్రి వెంగళాయ ఇవానుష్క ఒక తాడు,రాత్రంత మెలుకొని కాలక్షేపం చేయడానికి ఒక కజ్జికాయ జేబులో వేసుకుని పొలానికి బయల్దేరుతాడు. ఇంతలొ అన్నయ్యలు మేమే పట్టుకోలేకపోయాం వీడెందుకు అని అంతారు, ఐన ఇవానుష్క మాత్రం వారిని లక్ష్య పెట్టకుండ పొలానికి వెళ్ళి పోతాడు.రాత్రంతా జాగారం చేస్తు కుర్త్చుంటాడు ఇవానుష్క. ఇంతలొ ఒక తెల్లని గుర్రం పెద్ద పెద్ద రెక్కలతో పొలం లోకి వచ్చి వాల్తుంది. ఇవానుష్క దాన్ని చూసి ఎలాగైన పట్టూకోవాలని తాడు తీసుకుని గిర గిర తిప్పి సరిగ్గా దాని గొంతుకి బిగిస్తాడు. తప్పించుకోవాలని చుసిన గుర్రం తప్పించుకోలేక చివరకి ఇవానుష్క తో రాజి పడుతుంది.గుర్రం ఇవానుష్క తో ఇలా అంటుంది "ఇవానుష్క నన్ను వదిలిపెట్టూ నువ్వు నన్ను పిలిచిన వెంటనె వస్తాను నువ్వు అడిగింది చేస్తాను " అని అంటుంది. మరి నిన్ను ఎలా పిలవాలి అని అడుగుతాడు ఇవానుష్క. సరే నువ్వు నీకెప్పుడు అవసరం వచ్చినా ఊరికి దూరంగ వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేల "మాయ గుర్రమా మేటి గుర్రమా జ్ఞానివైన తేజ గుర్రమా ఇటు రా" అని అరవాలి.అని చెప్పి ఇంకెప్పుడు మీ పొలాన్ని పాడు చెయ్యను అని సెలవు తీసుకుంటుంది. పొద్దున్నె ఇంటికి వచ్చి జరిగింది చెప్తాడు ఇవానుష్క. అందరు ఇవానుష్క ని చూసి చెప్పింది చాలు ఇక పోయి పడుకొ అని హేళనగ నవ్వుతారు.ఇవానుష్క నవ్వుకుంటుపొయ్యితీనె(రష్యా లొ పాత కాలం లొ కింద నిప్పుతొ ఉన్న ఒక గూడులాంటిది ఉండి దాని పైన ఎక్కి పడుకొనేవారు,చలికి వెచ్చగ ఉండడం కోసం) ఎక్కి పడుకుంటాడు.ఇవానుష్క అన్నయ్యలు ఆ రోజు ఆ ఊరిలొని యువరాణి ఎలీన స్వయంవరం గురించి మట్లాడుకుంటుండగ ఇవానుష్క కుడా విని ఎలాగైన తను కుడా స్వయంవరానికి వెల్దామనుకుంటాడు. అన్నయ్యల్ని తీసుకెళ్ళమని అడుగుతాడు. వారు నవ్వి అక్కడికి నీ లాటి వారు రాకుడదని, వదినలకి సహాయంగ ఇంట్లొ ఉండమని చెప్పి వారు వెళ్ళిపోతారు. ఇంతలొ ఇవానుష్క అలోచించి వదినలు పుట్టకొక్కులు కోసుకొని వస్తాను బుట్ట ఇలా ఇవ్వండి అని బుట్ట తీసుకొని ఊరి చివరకు వెళ్ళిబుట్ట ఓ మూల గిరాటేసి దిక్కులు పిక్కటిల్లేల "మాయ గుర్రమా మేటి గుర్రమా ఇటు రా" అని అరవగానే, పెద్ద పెద్ద రెక్కలతో తెల్లని గుర్రం అక్కడ వాలుతుంది. ఇవానుష్క యువరాణి దగ్గరకు తీసుకొని పొమ్మంటాడు. గుర్రం ఐతే నువ్వు నా ఎడమ చెవి లో దూరి కుడి చెవి లో నుండి బయటకు రా అని చెప్తుంది. ఇవనుష్క ఎడమ చెవి లో దూరి కుడి చెవిలో నుండి బయటకు రాగనే టింగురంగామని పూల రంగడు లా తయరైపోతాడు. గుర్రం తన మీద ఎక్కించుకుని యువరాణి కోట కేసి పరుగెడుతుంది. దారిలొ అన్నయల్ని దాటి మరీ వెళ్ళిపోతాడు ఇవానుష్క. వారు అంత వేగంగ మొహం మీద దుమ్ము కొట్టుకుంటు పోతున్న ఈ యువరాజెవరో అనుకుంటు తిరిగి కోట వద్దకు పయనమవుతారు. స్వయంవరం లొని యువరాణి ఒంటి స్థంభం కోట లొ కిటికి పక్కన కుర్చొని ఉన్న ఎలీన చేతి కి ఉన్న వజ్రపుటుంగరాన్ని ఎవరైతే గుర్రం మీద ఎగిరి అందుకుంటారో వారికి ఎలీన ని ఇచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటిస్తాడు. ఎంతో మంది యువరాజులు , యువకులు ప్రయత్నిస్తారు. కాని ఎవ్వరు అందుకొలేకపొతారు. ఇవానుష్క వేగంగా వస్తూనే ఎగిరి ఎలీన ఉన్న కిటికి సరిగ్గా మూడడుగుల్లొ విఫలంవుతాడు. వెంటనే వేగంగా అక్కడి నుండి జారుకుంటాడు. తిరిగి ఊరి చివరకి వచ్చి కుడి చెవి లో దూరి ఎడమ చెవి లొ నుండి బయటకు రాగానె ఎప్పటిలా తయరైపొతాడు. ఇంటికి వెళ్ళి పు ట్టకొక్కులు ఇచ్చేసి ఏమి ఎరగనట్టు పొయ్యితీనె ఎక్కి పడుకుంటాడు. అన్నయ్యలు ఇంటికి రాగానే వారు చూసినవి వింతగ మాట్లాడుకుంటుంటారు. అవి విన్న ఇవానుష్క అన్నయ్యలు నేను మీకక్కడ అవుపడ్డనా అని అడిగితే. వారు నువ్వు మాకవుపడ్డం ఎమిటి పిచ్చెక్కిందా నీకు , ఫొ పొయ్యి పడుకొ ఫొ అని అరుస్తారు. ఇవానుష్క నవ్వుకుంటూ ఏమి ఎరగనట్టు పొయ్యితీనె ఎక్కి ముసుగు పెట్టి నిద్రపోతాడు.
పక్క రోజు కూడా అన్నయ్యలు స్వయంవరం చూడ్డానికి బయలుదేరుతారు. మరల ఇవానుష్క అన్నయ్యలు నన్ను కూడా మీతో తీసుకుని పొండి అని అడుగుతాడు. అన్నయ్యలు ఇంట్లో అందరం వెళ్ళితే ఎలాగ మీ వదినలకి సహాయంగ ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. సరే ఇవానుష్క వదినలకి అడవికి వెళ్ళి కట్టెలు కోసుకొని వస్తాను అని చెప్పి అడవికి వెల్తాడు. మళ్ళి దిక్కులు పిక్కటిల్లేల మాయ గుర్రాన్ని పిలుస్తాడు. ఎడమ చెవి లో దూరి కుడి చెవి లో నుండి బయటకు రాగానె టింగురంగామని పూల రంగడులా మారిపోతాడు. ఈ సారి ఎలీన కుర్చొని ఉన్న కిటికి కి సరిగ్గా రెండు అడుగుల్లో విఫలమవుతాడు. అక్కడున్నవారంతా " పట్టుకోండి పట్టుకోండి" అని అరుస్తున్న పట్టించుకోకుండ అక్కడి నుండి జారుకుంటాడు ఇవానుష్క. అడవికి వచ్చి కుడి చెవి లో దూరి ఎడమ చెవి లో నుండి బయటకు రాగానే మామూలుగ తయారైపోతాడు.
ఆఖరి రోజు ఇవానుష్క అడవికని వెళ్ళి మాయ గుర్రం తో తిరిగి కోటకి వెల్తాడు. ఈ సారి ఎలీన చేతికున్న వజ్రపుటుంగరాన్ని తీసుకోవడమే కాకుండా ఎలీన బుగ్గ పై ముద్దు కూడా పెట్టుకుంటాడు ఇవానుష్క. వేగంగా వెళ్ళిపోతున్న ఇవానుష్క ని పట్టుకోవాలని పట్టుకోలేకపోతారు అక్కడ చేరి వింతను చూస్తున్న జనం. ఇంటికి చేరిన ఇవానుష్క వేలికి కట్టేంటని అదిగితే పుట్టకొక్కులు కోస్తుంటే తెగిందని చెప్తాడు. ఇంతలొ అన్నయ్యలు వచ్చి ఏ విధంగ యువరాజు ఉంగారన్ని తీసుకొంది చెప్తుంటె ఇవానుష్క వేలికున్న గుడ్డను తీసేసిఉంగరాన్ని చూసుకుంటాడు. ఇల్లంతా ఒక్కసారి వెలుగుతో నిండి పోతుంది. అది చూసిన అన్నయ్యలు నిప్పనుకొని "ఒరెయ్ నిప్పుతో ఆటలాడకు" అని అరుస్తారు. వెంటనే తిరిగి గుడ్డ ని చుట్టేస్తాడు ఇవానుష్క.
యువరాణి ఎలీన ఉంగరాన్ని తీసుకు వెళ్ళిన ఆ యువరాజు ని తెలుసుకోవడం కోసం రాజు ఆ ఊర్లో ఉన్న వారందరు రాజు ఇచ్చే విందుకు రావలని లేదంటె కఠినంగా శిక్షింపబడుతారని చాటింపు వేయిస్తాడు.అది విని తప్పేది లేక ఇవానుష్క ని కూడా వెంట తీసుకుని వెళ్తారు. యువరాణి స్వయంగా అందరికి వడ్డిస్తూ ఇవానుష్క వద్దకు రాగానే వేలికున్న కట్టేంటని అడుగుతుంది. పుట్టకొక్కులు కోస్తుంటే తెగిందని చెప్తాడు. యువరాణి ఏది ఒక్క సారి కట్టు విప్పు చుద్దాం అని అడుగుతుంది. కట్టు విప్పగానే ఒక్క సారిగా ఆ ఆవరణమంతా వెలుగు తో నిండి పోతుంది.వెంటనే యువరాణి అతడే యువరాజని చెప్తుంది రాజు కి. వెంటనే రాజు ఎలీన కి ఇవానుష్క కి వైభవంగ పెళ్ళి జరిపిస్తాడు. ఈ కధ వ్రాసిన రచయిత చివర్లో ఇలా వ్రాసుకుంటాడు
విందులొ నేను పాల్గొంటి
అంతా గడ్డం పైనే పోసుకుంటి
కొంతైనా పోలేదు నొట్లోకి

Tuesday, January 8, 2008

నా చిన్ననాటి నా కెంతో ఇష్టమైన కధ.

నాకు షుమారు ఏడేళ్ల ప్రాయం కాబోలు , మా పెద్దమ్మ తో పీట మీద కూర్చొని పాలు తాగనని మారాం చేస్తే నాకు లంచం ఇచ్చి (అదే కధ చెప్పి ) పాలు తాగించేసేది మా పెద్దమ్మ. ఆ కధ అంటే నాకు ఎంతో ఇష్టం. అదే అనుభూతిని తలచుకుంటూ ఇక్కడ ఆ కధ వ్రాయాలనిపించింది. అన్ని కధల్లో మాదిరిగానే అనగనగా ఒక పేదరాసి పెద్దమ్మ ఆవిడకి ఓరోజు ఉసిరక్కాయ పచ్చడి తినాలానిపించింది. ఇంట్లో పని ముగించుకుని దుకాణానికి వెళ్ళి మంచి ఉసిరిక్కాయలు తెచ్చుకుంది. సరే ఇక వాటిని కడిగి, ఆరబోసి, ఆరిన తరువాత, తరగడం మొదలుపెట్టింది. ఇంతలో ఒక పెద్ద ఉసిరిక్కాయ "అవ్వ అవ్వ !!నన్ను తరగకు అని చిత్రంగా మాట్లాడుతుంది". అవ్వ కూడా సరేలెమ్మని సరదా పడుతుంది. తనకి కూడా ఎవ్వరూ లేరు కనుక తోడుగా ఉంటుందనుకొంధి.ఇక పొద్దున్నే ఉసిరిక్కాయ వాకిట్లో కూచోని వచ్చే పొయ్యవాళ్ళని చూడటం అవ్వతో సరదా గా కబుర్లు చెప్పటం . ఒక రోజు స్కూల్ కి వెళ్తున్న పిల్లలను చూసి ఉసిరిక్కాయ కూడా స్కూల్ కి వెళ్తానని అవ్వతో చెప్పింది. అవ్వ సరే వెళ్లు కానీ అక్కడ నిన్ను చూసి పిల్లలు ఆట పట్తిస్తారేమో గోల చెయ్యకుండా రమ్మ ని చెప్పింది. సరే ఉసిరిక్కాయ కూడా అందరిలానే లాగూ , చొక్కా తొడుక్కుని బూట్లు వేసుకొని స్కూల్ కి వెళ్తుంది.అవ్వ చెప్పినట్టుగానే కొంత మంది పిల్లలు ఉసిరిక్కాయ చుట్టూ చేరి "హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే , హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే,హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే" అని ఆట పట్టించేసరికి , ఉసిరిక్కాయ బిక్క మొకమెసుకుని ఇంటికి వచ్చి అవ్వతో జరిగింది చెబుతుంది. అవ్వ ఆలోచించి సరే నేను నీకో మంత్రం చెప్తాను ఆది చెప్పావంటే నీ జోలికి ఇక ఎవ్వరూ రారు అని మంత్రం చెబుతుంది అవ్వ. అదెంటంటేఎవరైతే నిన్ను ఏడీపిస్తారో వారికెదురుగా నిలబడి మనసులో మూడు సార్లు " నీ పొట్ట కి నా పొట్ట కి ఠామ్" అని అనాలి అని చెప్పి స్కూల్ కి వెళ్ళమంటుంది. మంత్రం నేర్చుకున్న ఉసిరిక్కాయ ధైర్యంగా స్కూల్ కి వెళ్తుంది . మళ్లీ ఆకతాయి పిల్లలు వచ్చి అల్లరి పట్టించగ ఈ సారి ఉసిరిక్కాయ మనసులో మూడు సార్లు "నీ పొట్ట కి నా పొట్ట కి ఠామ్" అంటుంది అంతే ..చిత్రంగా ఆ పిల్లలందరు చచ్చిపొతారు. అలాగే వరుసగా ఇంకొంతమంది పిల్లలు , ఆ తరువాత వంతుగా మాస్టార్‌లు ఇలా వర్సపెట్టి స్కూల్ మొతం ఖాళీ అయిపోతుంది . ఈ సారి ఆ ఊరి పోలీసులు , పెద్దలు అందరికి ఇదే అనువదిస్తుంది అహంకారంతో ఉన్న ఉసిరిక్కాయ. ఆఖరిగా మంత్రం చెప్పిన పెదరాసి పెద్దమ్మ మీద కూడా అదే మంత్రం చెప్తుంది. అవ్వ కూడా చచ్చి పోతుంది . అహంకారంతో ఉన్న ఉసిరిక్కాయ ఈ ఊరికంత నేనొక్కటే అనుకుంటూ ఎదురుగా ఉన్న అద్ఢము లో చూసుకొన్న తెలివిలేని ఉసిరిక్కాయ ఇంకో ఉసిరిక్కాయ ఉందనుకోని తిరిగి మంత్రాన్ని చదువుతుంది అంతే ....ఇంకెముంది ఆ ఉసిరిక్కాయ కూడా చచ్చి పోతుంది.
కధ అయిపోగానే మా పెద్దమ్మ కధలో నీతి అడిగేది , సమాధానం తెలీని నేను తుర్రు మనే దాన్ని !!!మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలియజెయ్యండి...

Friday, January 4, 2008

Google page

I have a another google page http://sujana.duttaluru.googlepages.com/.
This blogging is especially to write in my mother tongue Telugu

First Entry into the Blogging world

This is my first entry into the blogging world. !!!