Friday, October 21, 2011

తల్లి ..!!!

కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్ప పాటుదే ఈ ప్రయాణం అన్నారు అలి సెట్టి ప్రభాకర్. జనన మరణాలు, పాప పుణ్యాలను భరించేది ఆ భగవంతుడైతే జీవితాన్ని అందించేది మాత్రం తల్లే. ఒక సందర్భం లో శ్రీ కృష్ణుడు అర్జునుని కి దేహాంతర ప్రాప్తి ని వివరిస్తూ
దేహినో ‘స్మిన్ యథా దేహే
కౌమారం యవ్వనం జరా
తధా దేహాంతర-ప్రప్తిర్
ధీరసస్త్రాను ముహ్యతి
ఈ దేహం కౌమారం , యవ్వనం, వృద్యాప్యములను దాటుకుని వేరొక దేహము లో కి ప్రేవేశిస్తుంది ధీరులైన వారు ఈ విషయమును గూర్చి సదా చింతించవలదు . ఎలా అయితే పాత దుస్తులను వదిలి కొత్త దుస్తులను ధరిస్తామో అలాగే ఈ ఆత్మ పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది.

దేహం నుండి విడదీయబడిన జీవుడు తనకు అనువైన గర్భస్థానం కోసం పరిపరాల వెతుకుతూ ఉంటాడు. తిరిగి ఒక దేహాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్ని అగచాట్లు పడతాడో కదా . అండ , పిండ , బ్ర్మ్హహాండం అయ్యే వరకు మల మూత్రాదులతో తొమ్మిది నెలలు తన శరీరాన్ని సృష్టించుకోవడం కోసం తాపత్రయ పడతాడు. ఏ క్షణాన్నైనా, ఏ కారణం చేతనైన తనకు గర్భాన్ని ఇచ్చిన మాత్రుదేవత కాదనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఆ శరీరాన్ని వదిలి వెళ్లి పోవాల్సిందే. తిరిగి అదే కష్టాలు . ఇన్ని కష్టాలు పడి శరీరం ఆపాదించుకున్న ఆ 'శిశువు ' తన శిరస్సు బయట పడటాని కోసం ఎన్ని యోగాలు చేస్తాడో . గర్భం లో తన తల్లిని ప్రాధేయ పడతాడు 'అమ్మ ..ఈ ఒక్క జన్మనివ్వు , నా వేదనను నీ వేదన గా భరించమ్మ. జన్మ జన్మ లకు నీకు ఋణపడి ఉంటాను అని. అలా అని ఆ శిశువు లోపల కష్టపడకుండా ఉండదు కదా. మల మూత్రాదులను విసర్జించే యోని మార్గం గుండా రావటానికి సందేహించడు నిస్సందేహంగా శిరస్సు ను భూమి మీద పెట్టడానికి ప్రయత్నిస్తాడు . ఏ క్షణాన్నైనా దేహాన్ని వదిలిపెట్టేయ్యాల్సి వస్తుందేమో , గట్టిగా పట్టుకుంటాడు దేహాన్ని, అమ్మా నన్ను బయటకు నేట్టేయ్యమ్మా అని లోపల నుంచి ప్రాదేయపడతాడు. ఆ శిశువు యొక్క బాధను కన్యగా లేని మమకారాన్ని ఆ ఆడపిల్ల ప్రసవ వేదనలో తెలుసుకుంటుంది. తనకు జన్మనిచ్చిన తల్లిని ఒక్కసారి తలచుకుంటుంది , అమ్మా ఈ సృష్టి కోసం నువ్వెంత కష్టపడ్డావు నేను సృష్టికి ప్రతి రూపాన్నే కదా ! జన్మ కావాలని అడుగుతున్న'శిశువు ' తన దేహాన్ని కాపాడే భాద్యత నాది. ప్రసవ వేదనలోనే పుడుతుంది 'భాద్యత' . ఇద్దరు కలిసే ఆ శిరస్సు ను భూమ్మీదకు తీసుకు వస్తారు. శిరస్సు భూమ్మీద పడగానే దేహం లో చైతన్యం కలుగుతుంది. 'కేర్' మని గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపులో అర్ధాన్ని తెలుసుకుంటుంది. అది జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో ఆనందం లో కొట్టిన కేరింత. తల్లి ప్రస్థానం మొదలవుతుంది. మొదటగా తన సుఖ భోగాలను వదిలి పెడుతుంది. బిడ్డ యొక్క అసుద్దాన్ని తీసేయడానికి సంకోచించదు. ఎంతో ఆనందం తో చేసేస్తుంది. బిడ్డ తన చను మొనలను గట్టిగా లాగి గుంజుతున్నా బాధ తో భరిస్తుంది. బిడ్డ ఏడుపులోని అర్ధాన్ని వెదుకుతుంది. చిన్న చిన్న కాళ్ళ తో పాలు త్రాగుతూ పొట్ట లో తన్నుతున్నా తన ఆటలకు అడ్డు చెప్పదు సరిగ్గా తన ఆకలి తీర్చుకుంటుండగా బిడ్డ ఏడుస్తాడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాడి అవసరాలు తీరుస్తుంది , తనకి ఆకలేస్తుందన్న సంగతి కూడా మరచిపోతుంది. నిద్రాహారాలు మాని బిడ్డ కోసం పరితపిస్తుంది.

ఆ బిడ్డ పెరిగి పెద్దదై తల్లి చేయి వీడిన రోజులో ఒక్క సారి తల్లిని గుర్తు చేసుకుంటుందేమో కాని అదే తల్లి అను క్షణం తన బిడ్డలని తలచుకుంటునే ఉంటుంది. తను ముత్తల్లైనా తను తల్లి ఐన క్షణాలను మరచిపోదు, ప్రతి సారి అదే అనుభూతిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

భ్రూణ హత్యలను ఖండిద్దాం , ఆడపిల్లను ఆనందంగా ఎదగానిద్దాం, మనల్ని వీడిన మన బంధువులో లేక ఆత్మీయులో తిరిగి జన్మించేందుకు అవకాశాన్నిద్దాం.

Tuesday, November 24, 2009

చ్చీ ..పాడు వర్షం...

ఏంటి ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?ఇంటి పై కప్పు దేని తో వేయాలానా ? చార్మినార్ ఆజ్బెస్టాస్ రేకులు వాడితే సరి....హి హి హి ..మ్మ్ ఆపుతావా!మరి దేనికంత నిరాశగా ఉన్నావ్?పాడు వర్షం ఎక్కడికి పోవడనికి లేదు రావడానికి లేదు. అసలు ఎప్పుడు నీకు చిరాకే..జోరున వర్షం పడినా, చల్లగా మంచు కురుస్తున్నా...అన్నిటికి విసుక్కుంటావ్..అసలు ఆ వర్షం పడె ముందు మట్టిలోంచి వఛ్చే వాసన ఎంత అధ్భుతంగా ఉంటుంది ..అలాంటి వాసన నీకు ఏ ఇటాలియన్ సెంట్ లో 100 "£" పెట్టి కొన్నా రాదే.ఎప్పుడు బిజీ నే. వర్షాలు రాకపొతే తిడతావు, వర్షాలు పడితే విసుక్కుంటావ్. ఐనా కార్ లొ కిటికి అద్దాలన్ని ముసేసుకుని ఎక్కడ రెండు చినుకులు కార్ లో పడితే కార్పెట్ పాడైపొతుందనే భాదే గా.. ,ఎంచక్క కార్ లొనించి వర్షాన్ని చూసి అనందించవచ్చు కదా?
సరదాగా పిల్లలు ఏ రొజైనా వర్షం తో ఆడుకుంటున్నారా?అసలు వాళ్ళకి వాన వాన వల్లప్పా ,వాకిలి తిరుగు చెల్లప్ప అనె పాట పాడాలనైనా తెలిసేట్టు చేస్తున్నావా?చిట్టి చిట్టి పడవలు చేయడం సుమ్మర్ కాంప్ లో నేర్చుకుంటున్నారే.. ఎంత చోద్యం ? పడవలు చేయడం సరదాగ ఆనకట్టలు కట్టడం డాబా మీద తూముల్లో నీళ్ళు తీయడం లాంటి చిన్న చిన్న సరదాలన్ని మర్చిపొతున్నారు పిల్లలు ..ప్చ్హ్..అపార్ట్ మెంట్ కల్చర్, విదేసి ప్రయాణాలు కదా .

నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అంటు సరదాగ పాడుకుంటు అటు ఇటు తిరిగే ఆ రోజులేవి ? సీజన్ లెస్ రైన్స్ అంటు గొడుగులు రైన్ కోట్స్ వేసుకుని పరిగెడుతున్నావ్ అదేంటి అంటె గ్లోబల్ వార్మింగ్ అంటావ్..ఏంటొ .. వర్షాకాలం రాబోతోందనేందుకు గుర్తుగా పుట్టలు పుట్టలు చీమలు కనిపించేవి.ఇప్పుడు ఆ చీమలు కూడ రాకుండా గొడకు కొట్టే సున్నం లో భయంకరమైన విషపు మందులు వాడి వాటిని దూరం చేసావ్. చీమలనుంచి మనమెంతో నేర్చుకుందాం అంటు పత్రికల్లో చదవడం అవసరమొచ్చినప్పుడు మాట్లాడ్డం అంతే గాని ప్రకృతిని దగ్గరనించి చూడడం మర్చిపోయావు. వర్షం పడే రాత్రి ఉధృతమైన గాలి,ఉరుముల మెరుపుల శబ్దాలు,కప్పల బెక బెకలు నీకు వినిపించట్లేదు కదూ ..అవునులే టి.వి లో
special movie లేదా its raining heavy here ఇంటర్నెట్ చాటింగ్ లో బిజి కదా. నువ్వు యాంత్రికంగా తయారయ్యావు. వర్షం లో సరదాగ గడపడం నీకిష్టమే కాని నీకు హిపోక్రశి. ..చ్చీ ..పాడు వాన అంటు చిరాకు పడుతున్నావ్.. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్న పని జరగలేదు, నువ్వు గమ్యాన్ని చేరలేదు..ఆ భాద ని చిరాకు రూపం లో వర్షం మీద నెడుతున్నవ్..చిరాకు ని మర్చిపో నువనుకున్నట్టు అన్నిటిని ఆనందించగలవు ..ఐ ప్రామిస్ యూ.

Sunday, May 25, 2008

కడుపు నిండా మద్యం-తెలుగుదేశానికే ఓటు.

ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు ప్రచారసాధనాల్లో ప్రతి పార్టీ పాటలు, అబినయాలతో వినూత్నంగా ప్రచారం చెయ్యడం బావుంది. కాని తెలుగుదేశం పార్టీ ప్రకటన, ఒక వంతు నవ్వు తెప్పిస్తొంది నా మటుకు.

మనకందరికి సుపరచితమైన సినిమా మిష్టర్ పెళ్ళాం. ఆ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ భార్య ఆమని పని చేసే ఎం.డి. గోపాల క్రిష్ణ ని ఒకానొక పాట లో ఆటపట్టించిన సందర్భం గుర్తు వచ్చింది. ఆ పాట చివరిలో "గోపాల క్రిష్ణుడు పక్షి...గోవింద క్రిష్ణుడు పక్షి.." కోరుస్ అంతా కుడా పక్షి పక్షి అంటూంటారు .....ఎం.ఎస్ మొహం లో బాధ ఎక్కువైపోతుంటుంది..అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఆనందపడుతుంటాడు. చివరకి కాని చెప్పడు పక్షి వాహనుడై వెడలె అని. వాక్యాలని పూర్తి గా చెప్పాలి లేక పోతే అర్ధాలు మారిపోతుంటాయి

తెలుగుదేశం ప్రకటన లో కూడా ఇదే జరిగింది. సన్నివేశం ఎలా ఉంటుందంటె ఒక తాగుబోతు ఇంటికి తాగి వస్తాడు. భార్య అతన్ని ఉద్దేసించి, పిల్లవాడికి మందులు తెమ్మంటె నువ్వు మందు తాగి వస్తావా అని అడుగుతుంది?పిల్లవాడికి మందులు తెద్దామంటె దబ్బులేక ఆ బాధ లో ఈ మందు తాగనంటాడు ..ఆ సందర్భం లో వాడు "నీ తల్లి బెల్టు తీస్తా అంటాడు.."అందుకు భార్య ఈ సారి చంద్రబాబు నాయుడు వస్తే బెల్టు షాపుల మీదా బెల్టు తీస్తాడు అంటుంది. ప్రకటన లో భాగంగా ఇదెక్కడి ఖర్మ (ఇక్కడ ఉపిరి పీల్చుకునే అంత గాప్) కడుపునిండా మద్యం వెంటనే తెలుగు దేశాన్ని గెలిపించండి అని వస్తుంది . నేను ఈ ప్రకటన మొదట్లొ చివరి రెండు లైన్లు మాత్రామే విన్నా ..చాలా నవ్వు వచ్చింది తరువాత పూర్తిగా విన్నాక అర్ధమైంది. ఏ భాషకైన డిక్షన్ చాల అవసరం లేక పోతే ఇలాగే నవ్వుకోవలసి వస్తుంది.

ఇది తెలుగుదేశం పార్టీ భావాలని కించపరచడానికి రాసింది మాత్రం కాదు. నాకు ఇలా తోచింది అని చెప్పడానికి మాత్రమే. ..

Wednesday, May 14, 2008

గజేంద్ర మోక్షం లో ని పద్యాలు

boomp3.com

గజేంద్ర మోక్షం లో ని పద్యాలు

పోతానామత్యుల వారి చే ఆంధ్రీకరింపబడి వ్యాస భగవానుని విరచితమైన భాగవతం లో ని గజేంద్ర మోక్షం లో ని కొన్ని నాకిష్టమైన పద్యాలు.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతహ్ పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై


ఎవ్వని చేఁ జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె యైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో

(తెలుగు పెరంట్ వారికి కృతజ్ఞతలతో)

Tuesday, April 29, 2008

నీ కోసం ఎదురు చూస్తూ నీ...

తట్టి తట్టి లేపుతున్నట్టనిపించి లేచి చూసాను. ఆదివారం, సెల్ ఫోన్ లో సమయం 3గం.59ని.కావస్తోంది. ఎండాకాలం కాని బయట చల్లగా ఉంది. బహుశా ఇంకాసేపట్లో వర్షం పడబోతుందేమో. ఆరిన బట్టలు ఇంట్లోకి తెద్దామని బయటకు వెళ్ళబోతుంటే నిన్ను లేపింది నీ పనులు నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కాదు, నాతో కాసేపు అలా గార్డెన్ లో కూర్చొని వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? పొద్దున్నే వాకింగ్ వెళ్ళేప్పుడు మనిద్దరం నడిచేది అరగంటే అయినా ముందు రోజు జరిగిన విషయాలన్ని చెప్పేదానివి. మరి ఇప్పుడు ఆ అరగంట కూడా ఐపాడ్ లో విష్ణు సహస్రనామం వింటున్నావు. లేకపొతే నీ తోటి నడిచేవాళ్ళతో అమెరికా లో రిసెషన్ గురించో లేక పాకిస్ఠాన్ లో సరబజిత్ క్షమాపణ గురించో మాట్లాడుతున్నావు.నేనసలు నీకు గుర్తున్నానా? అందంగా వికసించిన ఎర్ర గులాబిని చూసి నువ్వేసిన కృత్రిమ ఎరువు గురించి మాట్లాడుతున్నావు. అరె, అదే అంతకు ముందు నాతో దాని అందాన్ని, దాన్ని సృష్టించిన ప్రకృతిని గురించి గంటలు గంటలు గడిపేదానివి. నీలో ఎందుకింత మార్పు?ఎందుకింత కృత్రిమంగా తయారయ్యావు? పెనం మీద దోసె వేసి దాన్ని తిప్పుతూ సెల్ ఫోన్ లో కష్టమర్ కేర్ వాళ్ళతో ముందు నెల్లో ఎక్కువ వచ్చిన బిల్ గురించి కొట్లాడతావు. కాణి ఖర్చు లేకుండా నాతో మాట్లాడ్డానికి నీకు ఒక్క నిమిషం లేదా ?అసలేంటి నీ యాంత్రిక జీవనం ? పెద్దగా పరిచయం లేని వాళ్ళని వీకెండ్ కి భోజనానికి రమ్మని ఫోన్ లో పిలుస్తావే ? వాళ్లేసే జోకులకి నీ నుంచి వచ్చేది ప్లాస్టిక్ స్మైల్ కాదా ?నిజంగ సహజంగా నవ్వి ఎన్ని రోజులైంది ? ఎక్కడికి నీ ఉరుకులు ,పరుగులు ? ఎవరి కోసం ?


పాపయి సీతాకోకచిలుకని చూపించి కేరితలు కొడుతుంటే దానికి సైన్స్ భోధిస్తావు లార్వా అని,ప్యుపా అని, కాటర్పిల్లర్ అని.. అంతే కాని అది దాని రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటే రంగులు రంగులు గా మారే దాని అందాన్ని చెప్పలేవా ? తేనె కోసం పువ్వు పువ్వు మీదా వాలుతు చేసే శబ్దాన్ని నిశ్శబ్దంగా వినమని చెప్పలేవా ? ఆ చిన్ని పాపయి బుర్ర నుంచి నువ్వు ఎమి శోధిస్తున్నావు ?

రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఆ దిండు కింద సెల్ ఫొన్ ఎందుకు ?అర్ధరాత్రి కనీసం నీ కల్లో అయినా మాట్లాడుదామంటే వినూత్నమైన రింగ్ టోన్ తో అమెరికా నుంచి వచ్చే యూసర్ కాల్ తో నువ్వు బిజీ.వాడిచ్చే డాల్లర్ల కోసం సమయం ఉదయం నాలుగు గంటల దాకా పని. ఆ వత్తిడి ని తగ్గించుకోవడానికి యోగా చేస్తావు ..ఎందుకు ?


కాఫీ అయ్యిందిగా రా అలా కాసేపు గార్డెన్ లో కుర్చోని మాట్లాడుకుందాం.నాతో అరగంట సేపు సమయాన్ని వెచ్చించు, నీ కృత్రిమమైన జీవితాన్నుంచి దూరంగా వచ్చి నాతో మమేకమవ్వు. నీ యాంత్రిక జీవనాన్ని ఉల్లాసంగా గడపగలవని నేను భరోసా ఇస్తున్నాను. నాకు సహనం, ఓర్పు ఎక్కువ నీకోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాను నేస్తం. నాలోని మనుసు మౌనంగా నిరీక్షిస్తోంది నాతో మాట్లాడ్డానికి. ప్చ్ ...నాలోని మన్సు తో మాట్లడలేకపొతున్నా, ఇది నాలోని హిపోక్రసి కాదా ? నాది కృత్రిమమైన జీవితమా ..ఎమిటి ఈ సంఘర్షణ???

Wednesday, April 16, 2008

రామయ్యా ..తేనేగూడు లో పొరపాటు జరిగిందయ్యా..

రామయ్య.. పొరపాటు జరిగిపోయిందయ్యా ..శ్రీ రామనవమి రోజు నిన్ను స్తుతిస్తూ భద్రాచలం లో అందంగా కొలువు తీరిన నీ ముఖచిత్రాన్ని అందరూ చూడాలనే ఆశ తో "చూచితిని సీతమ్మను రామా" (ఏప్రిల్ 14)అనే టపా ద్వారా అంతర్జాలం లో ప్రచురించాను. తేనేగూడు అనే బ్లాగుల సమాహారం లో బ్లాగు లో ని వ్యాసములను మూఖచిత్రం తో సహా చూపించే మొదటి పేజీ లో ఆ ముఖచిత్రం ఎలా వచ్చిందో మరి. సాంకేతిక కారణాలేలాంటివో నా చిత్తానికి నేను ఎరుగను. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో ..నా మనస్సాక్షిగా నేను ప్రచురించింది మాత్రం నీ ముఖచిత్రాన్నే ప్రభు. తప్పిదం జరిగిందనే ఆవేదనలో వారికి లేఖ కూడా వ్రాసాను. కాని ప్రత్యుత్తరం లేదు. ఎవరిని నిందించాలి అజ్ఞానపు అంతర్జాలాన్నా ? నీ ముఖచిత్రాన్ని వీక్షించలేని మా కన్నులనా..


నా మనవి ఆలకించు శ్రీరామ..నీవైనా చెప్పవమ్మా సీతమ్మా..

నా టపా కలిగిన లింకును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

http://www.thenegoodu.com/?which=50&cid=&mode=