ప్రొద్దున్నే ఫిల్టర్ కాఫీ, చేతిలో సమాచార పత్రిక, రేడియో లో సంస్కృతం పాఠాలు...ఇవి ప్రొద్దున్నే నా అలవాట్లు. సాంకేతిక మార్పులు మూలంగా కొన్ని రూపాంతరాలు చోటు చేసుకున్నాయి. రెండు గిన్నెల స్టీల్ ఫిల్టర్ కి బదులు, విద్యుత్ ఫిల్టర్, రేడియో కి బదులు టి.వి.... నా అలవాట్లు మాత్రం అవే..కాని సంతృప్తి కూడా రూపాంతరం చెందుతోంది. సరే ఇంక సమాచార పత్రిక చదువుదామంటే, ప్రాశ కోసం పాటుపడుతూ తాటికాయంత అక్షరాలతో ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం ఒక్క చోట లేక మిగిలిన సమాచారం కోసం ఎక్కడో 11 వ పుటలొ వెతుక్కోవడం...పొద్దున్నే విసుగ్గా అనిపిస్తుంది ...సరే టి.వి. చూద్దామంటె ఇంగ్లీష్ లాంటి తెలుగు తో వత్తులు, దీర్ఘాలు, పొల్లులు, హల్లులు లేక వయలు, హొయలు పోతు మాట్లాడే తెలుగు వినలేక సాంకేతిక రూపాంతరం చెందిన అలవాట్లతో తిరిగి నా దైనందిన పనులతో మర్చిపోవడం పరిపాటైపోయింది.
ఆ మధ్య నేను అంతర్జాలం లో ఒక బ్లొగ్ లో తెలుగు,ఇంగ్లిష్ కలిసి తెంగ్లిష్ అని ఒక క్రొత్త భాష వచ్చినట్టు చూసి తెలుగు పరిపక్వత చెందిందా లేక రూపాంతరం చెందిందా అని అనిపించింది. దీనికి తార్కణంగా ఒక రోజు టి.వి. లో ఒక కార్యక్రమం లో భాగంగా ఫోన్ లో జరిగిన సంభాషణ విని తెంగ్లిష్ భాష పైత్యం అనిపించింది...ఆ సంభాషణ టూకిగా ...ఒక ఉపాధ్యాయుడికి, జాకిలని పిలవబడె టి.వి వ్యాఖ్యాతకి మధ్య జరిగింది.
జాకి :: మీరు ఉపాధ్యాయులు కాబట్టి మిమ్మల్ని "సర్" అని పిలుస్తున్నాను..
ఉపాధ్యాయుడు:: నన్ను పేరు తో పిలవవచ్చు. "సర్" అనేది ఇంగ్లిష్ పదం కదా,పైగా నేను వయసులో చిన్నవాడినే.
జాకి :: సరేనండి మీరు గౌరవమైన వృత్తి లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని తెలుగు లో "మాస్టారు" అని అంటాను ఎమంటారండి "మాస్టారు" అని ....
ఇలా జరుగుతున్న వారి సంభాషణ విని తల పట్టుకోవల్సివచ్చింది.... మాస్టారు అనేది తెలుగు పదమని చెప్తున్న నేటి యువతరం తెంగ్లిష్ కి నా జొహార్లు .....మీ కరతాళ ధ్వనులు ....
2 comments:
సర్ / సారూ, సార్, మాస్టారూ, మాస్టార్ అన్నీ తెలుగు పదలే కాదంటారా?
మీరు, తమరు ...అనేవి తెలుగు పదాలు, కాని సర్, మస్టార్ కి రు చేర్చి ...తెలుగు పదాలా అని అడిగితే ఎమి చెప్పమంటారు ??
Post a Comment