కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది....
చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి
నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా
మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై.
తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము; ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కర్మ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భౄం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
ట్ళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు
గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.
అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరురో జుద్యాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కౄశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను.
No comments:
Post a Comment