Tuesday, April 29, 2008

నీ కోసం ఎదురు చూస్తూ నీ...

తట్టి తట్టి లేపుతున్నట్టనిపించి లేచి చూసాను. ఆదివారం, సెల్ ఫోన్ లో సమయం 3గం.59ని.కావస్తోంది. ఎండాకాలం కాని బయట చల్లగా ఉంది. బహుశా ఇంకాసేపట్లో వర్షం పడబోతుందేమో. ఆరిన బట్టలు ఇంట్లోకి తెద్దామని బయటకు వెళ్ళబోతుంటే నిన్ను లేపింది నీ పనులు నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కాదు, నాతో కాసేపు అలా గార్డెన్ లో కూర్చొని వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? పొద్దున్నే వాకింగ్ వెళ్ళేప్పుడు మనిద్దరం నడిచేది అరగంటే అయినా ముందు రోజు జరిగిన విషయాలన్ని చెప్పేదానివి. మరి ఇప్పుడు ఆ అరగంట కూడా ఐపాడ్ లో విష్ణు సహస్రనామం వింటున్నావు. లేకపొతే నీ తోటి నడిచేవాళ్ళతో అమెరికా లో రిసెషన్ గురించో లేక పాకిస్ఠాన్ లో సరబజిత్ క్షమాపణ గురించో మాట్లాడుతున్నావు.నేనసలు నీకు గుర్తున్నానా? అందంగా వికసించిన ఎర్ర గులాబిని చూసి నువ్వేసిన కృత్రిమ ఎరువు గురించి మాట్లాడుతున్నావు. అరె, అదే అంతకు ముందు నాతో దాని అందాన్ని, దాన్ని సృష్టించిన ప్రకృతిని గురించి గంటలు గంటలు గడిపేదానివి. నీలో ఎందుకింత మార్పు?ఎందుకింత కృత్రిమంగా తయారయ్యావు? పెనం మీద దోసె వేసి దాన్ని తిప్పుతూ సెల్ ఫోన్ లో కష్టమర్ కేర్ వాళ్ళతో ముందు నెల్లో ఎక్కువ వచ్చిన బిల్ గురించి కొట్లాడతావు. కాణి ఖర్చు లేకుండా నాతో మాట్లాడ్డానికి నీకు ఒక్క నిమిషం లేదా ?అసలేంటి నీ యాంత్రిక జీవనం ? పెద్దగా పరిచయం లేని వాళ్ళని వీకెండ్ కి భోజనానికి రమ్మని ఫోన్ లో పిలుస్తావే ? వాళ్లేసే జోకులకి నీ నుంచి వచ్చేది ప్లాస్టిక్ స్మైల్ కాదా ?నిజంగ సహజంగా నవ్వి ఎన్ని రోజులైంది ? ఎక్కడికి నీ ఉరుకులు ,పరుగులు ? ఎవరి కోసం ?


పాపయి సీతాకోకచిలుకని చూపించి కేరితలు కొడుతుంటే దానికి సైన్స్ భోధిస్తావు లార్వా అని,ప్యుపా అని, కాటర్పిల్లర్ అని.. అంతే కాని అది దాని రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటే రంగులు రంగులు గా మారే దాని అందాన్ని చెప్పలేవా ? తేనె కోసం పువ్వు పువ్వు మీదా వాలుతు చేసే శబ్దాన్ని నిశ్శబ్దంగా వినమని చెప్పలేవా ? ఆ చిన్ని పాపయి బుర్ర నుంచి నువ్వు ఎమి శోధిస్తున్నావు ?

రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఆ దిండు కింద సెల్ ఫొన్ ఎందుకు ?అర్ధరాత్రి కనీసం నీ కల్లో అయినా మాట్లాడుదామంటే వినూత్నమైన రింగ్ టోన్ తో అమెరికా నుంచి వచ్చే యూసర్ కాల్ తో నువ్వు బిజీ.వాడిచ్చే డాల్లర్ల కోసం సమయం ఉదయం నాలుగు గంటల దాకా పని. ఆ వత్తిడి ని తగ్గించుకోవడానికి యోగా చేస్తావు ..ఎందుకు ?


కాఫీ అయ్యిందిగా రా అలా కాసేపు గార్డెన్ లో కుర్చోని మాట్లాడుకుందాం.నాతో అరగంట సేపు సమయాన్ని వెచ్చించు, నీ కృత్రిమమైన జీవితాన్నుంచి దూరంగా వచ్చి నాతో మమేకమవ్వు. నీ యాంత్రిక జీవనాన్ని ఉల్లాసంగా గడపగలవని నేను భరోసా ఇస్తున్నాను. నాకు సహనం, ఓర్పు ఎక్కువ నీకోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాను నేస్తం. నాలోని మనుసు మౌనంగా నిరీక్షిస్తోంది నాతో మాట్లాడ్డానికి. ప్చ్ ...నాలోని మన్సు తో మాట్లడలేకపొతున్నా, ఇది నాలోని హిపోక్రసి కాదా ? నాది కృత్రిమమైన జీవితమా ..ఎమిటి ఈ సంఘర్షణ???

5 comments:

Anonymous said...

బారాసారు. నాలోని జీవుడు అప్పుడప్పుడూ ఇలానే విన్నవించుకుంటూంటాడు.

sujana said...

Thanks andi

Majji said...

సుజన మీకు గుర్తుందా ఒకసారి నేను parallel జీవితం గురించి మాట్లాడాను. ఇది అందరిలోనా వుండే సంగర్షణ మీరు అక్షర రూపాన్ని ఇచ్చారు. చాలా బాగా రాసారు. ఆలోచిస్తూ ఏదో ఇలా రాస్తున్నాను కాని మిమల్ని కండిచాలని కాదు.

మనసు పరివాహక ప్రాంతం మీద చెలియలకట్ట నీవే.. ఆనకట్టను కట్టి మనస్తాపం కలిగించకు.. అంటుంది సహచర .. ఆనకట్టలు కట్టి కట్టి ఆ పరివాహక ప్రాంతాన్నే మరిచి పోయాను. ఒకటి సున్నా లలో ఇమడని ప్రపంచం లేదని అంటుంది నా గణాంక పెట్టి. పిక్షెల్స్ లో చూసే ఎమోషన్స్ కీ అలవాటు పడ్డాను. క్లింట్స్, ప్రొగ్రెస్స్ , మైల్ స్టోన్స్ అంటూ మానసిక వ్యభిచారం మెదలేట్టినప్పుడే మనసు విషయం మర్చిపోయాను. రాజి అంటూ , జీవితం అంటూ మనసని ఎన్నిసార్లు ఓడించ లేదు. మనస్సాక్షి ని అంటూ నిలిచి నన్ను ప్రశ్నించి నప్పుడే నా శత్రువు గ చూసాను. అంత వెచ్చించి హెలికాప్టర్ లో నయాగరా అందాల్ని ని చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మా పొలం లోకి గండికొట్టి నీళ్ళు వదలటం గుర్తుకు తెచ్చే మనసుతో నాకేం పని. నువ్వు హిపోక్రసి కృత్రిమం అంటావు కాని ఇదే జీవితం అంటుంది నా అనుభవం.

sujana said...

శేఖర్ గారు ,

భూత, భవిష్యత్ కాలాల గురించి మనసు పడె సంఘర్షణ గురించి మీ వ్యాఖ్య లో బాగా వివరించారు. మీరూ ఇలాంటి సంఘర్షన లోనే ఉంటూ, హిపొక్రసి ని అనుభవం అంటున్నారు. జి. క్రిష్ణమూర్తి గారు ప్రేమ మరియు ఒంటరితనం గురించి వివరిస్తూ మనం ఇంతకు ముందు చూసిన ప్రక్రుతి యొక్క అందాలు మన మనసుని ఎప్పుడొ అక్రమించుకునే ఉంటాయి ..అటువంటప్పుడు మనం వర్తమానం లో చూసే అందాలని వాటి తో పొల్చుకుంటునే ఉంటాము ..అందుకనే మనసు ఏ విధమైన అనుభూతి చెందదని, అంటువంటప్పుడు మనసు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతుందని. మీరు, ప్రక్రుతి అందాలని , గణాంక పెట్టని ఏక కాలం లో చూస్తున్నారు ..అదే మీరు పొలం లో గండి కొట్టి ప్రవహస్తున్న నీళ్ళ గురించి ఆలోచించే మనసు తో "నాకేం పని " అనుకున్నా , నేను ఉన్నాను అంటూ అంతరంగాలలోకి తొంగి చూస్తోంది గణాంక పేట్ట గురించి ఎరుగని ఆ భూతకాలాం లో నే మిగిలిపోయిన వర్తమానం లో ఒంటరైపోయిన ఆ మనసు.

praveena said...

Hello andi!chaala rojula tharuvatha mee blog prapanchamloki vachchaanu. chaala baaga raasaaru.Sarigga cheppalante kannillu teppinchelaaga...
chinna chinna anubhavaalani,anandaalani vadulukonianduku ilaa parigeduthunnaamo kada?