Tuesday, April 29, 2008

నీ కోసం ఎదురు చూస్తూ నీ...

తట్టి తట్టి లేపుతున్నట్టనిపించి లేచి చూసాను. ఆదివారం, సెల్ ఫోన్ లో సమయం 3గం.59ని.కావస్తోంది. ఎండాకాలం కాని బయట చల్లగా ఉంది. బహుశా ఇంకాసేపట్లో వర్షం పడబోతుందేమో. ఆరిన బట్టలు ఇంట్లోకి తెద్దామని బయటకు వెళ్ళబోతుంటే నిన్ను లేపింది నీ పనులు నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కాదు, నాతో కాసేపు అలా గార్డెన్ లో కూర్చొని వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? పొద్దున్నే వాకింగ్ వెళ్ళేప్పుడు మనిద్దరం నడిచేది అరగంటే అయినా ముందు రోజు జరిగిన విషయాలన్ని చెప్పేదానివి. మరి ఇప్పుడు ఆ అరగంట కూడా ఐపాడ్ లో విష్ణు సహస్రనామం వింటున్నావు. లేకపొతే నీ తోటి నడిచేవాళ్ళతో అమెరికా లో రిసెషన్ గురించో లేక పాకిస్ఠాన్ లో సరబజిత్ క్షమాపణ గురించో మాట్లాడుతున్నావు.నేనసలు నీకు గుర్తున్నానా? అందంగా వికసించిన ఎర్ర గులాబిని చూసి నువ్వేసిన కృత్రిమ ఎరువు గురించి మాట్లాడుతున్నావు. అరె, అదే అంతకు ముందు నాతో దాని అందాన్ని, దాన్ని సృష్టించిన ప్రకృతిని గురించి గంటలు గంటలు గడిపేదానివి. నీలో ఎందుకింత మార్పు?ఎందుకింత కృత్రిమంగా తయారయ్యావు? పెనం మీద దోసె వేసి దాన్ని తిప్పుతూ సెల్ ఫోన్ లో కష్టమర్ కేర్ వాళ్ళతో ముందు నెల్లో ఎక్కువ వచ్చిన బిల్ గురించి కొట్లాడతావు. కాణి ఖర్చు లేకుండా నాతో మాట్లాడ్డానికి నీకు ఒక్క నిమిషం లేదా ?అసలేంటి నీ యాంత్రిక జీవనం ? పెద్దగా పరిచయం లేని వాళ్ళని వీకెండ్ కి భోజనానికి రమ్మని ఫోన్ లో పిలుస్తావే ? వాళ్లేసే జోకులకి నీ నుంచి వచ్చేది ప్లాస్టిక్ స్మైల్ కాదా ?నిజంగ సహజంగా నవ్వి ఎన్ని రోజులైంది ? ఎక్కడికి నీ ఉరుకులు ,పరుగులు ? ఎవరి కోసం ?


పాపయి సీతాకోకచిలుకని చూపించి కేరితలు కొడుతుంటే దానికి సైన్స్ భోధిస్తావు లార్వా అని,ప్యుపా అని, కాటర్పిల్లర్ అని.. అంతే కాని అది దాని రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటే రంగులు రంగులు గా మారే దాని అందాన్ని చెప్పలేవా ? తేనె కోసం పువ్వు పువ్వు మీదా వాలుతు చేసే శబ్దాన్ని నిశ్శబ్దంగా వినమని చెప్పలేవా ? ఆ చిన్ని పాపయి బుర్ర నుంచి నువ్వు ఎమి శోధిస్తున్నావు ?

రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఆ దిండు కింద సెల్ ఫొన్ ఎందుకు ?అర్ధరాత్రి కనీసం నీ కల్లో అయినా మాట్లాడుదామంటే వినూత్నమైన రింగ్ టోన్ తో అమెరికా నుంచి వచ్చే యూసర్ కాల్ తో నువ్వు బిజీ.వాడిచ్చే డాల్లర్ల కోసం సమయం ఉదయం నాలుగు గంటల దాకా పని. ఆ వత్తిడి ని తగ్గించుకోవడానికి యోగా చేస్తావు ..ఎందుకు ?


కాఫీ అయ్యిందిగా రా అలా కాసేపు గార్డెన్ లో కుర్చోని మాట్లాడుకుందాం.నాతో అరగంట సేపు సమయాన్ని వెచ్చించు, నీ కృత్రిమమైన జీవితాన్నుంచి దూరంగా వచ్చి నాతో మమేకమవ్వు. నీ యాంత్రిక జీవనాన్ని ఉల్లాసంగా గడపగలవని నేను భరోసా ఇస్తున్నాను. నాకు సహనం, ఓర్పు ఎక్కువ నీకోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాను నేస్తం. నాలోని మనుసు మౌనంగా నిరీక్షిస్తోంది నాతో మాట్లాడ్డానికి. ప్చ్ ...నాలోని మన్సు తో మాట్లడలేకపొతున్నా, ఇది నాలోని హిపోక్రసి కాదా ? నాది కృత్రిమమైన జీవితమా ..ఎమిటి ఈ సంఘర్షణ???

Wednesday, April 16, 2008

రామయ్యా ..తేనేగూడు లో పొరపాటు జరిగిందయ్యా..

రామయ్య.. పొరపాటు జరిగిపోయిందయ్యా ..శ్రీ రామనవమి రోజు నిన్ను స్తుతిస్తూ భద్రాచలం లో అందంగా కొలువు తీరిన నీ ముఖచిత్రాన్ని అందరూ చూడాలనే ఆశ తో "చూచితిని సీతమ్మను రామా" (ఏప్రిల్ 14)అనే టపా ద్వారా అంతర్జాలం లో ప్రచురించాను. తేనేగూడు అనే బ్లాగుల సమాహారం లో బ్లాగు లో ని వ్యాసములను మూఖచిత్రం తో సహా చూపించే మొదటి పేజీ లో ఆ ముఖచిత్రం ఎలా వచ్చిందో మరి. సాంకేతిక కారణాలేలాంటివో నా చిత్తానికి నేను ఎరుగను. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో ..నా మనస్సాక్షిగా నేను ప్రచురించింది మాత్రం నీ ముఖచిత్రాన్నే ప్రభు. తప్పిదం జరిగిందనే ఆవేదనలో వారికి లేఖ కూడా వ్రాసాను. కాని ప్రత్యుత్తరం లేదు. ఎవరిని నిందించాలి అజ్ఞానపు అంతర్జాలాన్నా ? నీ ముఖచిత్రాన్ని వీక్షించలేని మా కన్నులనా..


నా మనవి ఆలకించు శ్రీరామ..నీవైనా చెప్పవమ్మా సీతమ్మా..

నా టపా కలిగిన లింకును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

http://www.thenegoodu.com/?which=50&cid=&mode=

Sunday, April 13, 2008

చూచితిని ..సీతమ్మను..రామా



కమలోధ్భవుడైన బ్రహ్మ ముఖం నుండి వేదం, వల్మికసంభవుడైన వాల్మికి మహర్షి ఘంటం నుండి శ్రీమద్రామాయణం పుట్టాయి. బ్రహ్మ చతుర్ముఖుడు, వాల్మీకి చతుర వచనుడు. బ్రహ్మ లోక విధాత, వాల్మీకి శ్లొక విధాత. వాల్మీకి చేత ఆ వేదం సాక్షాత్తుగా రామాయణమై వెలసినది.అందుకనే రామాయణాన్ని ఆది కావ్యము, వాల్మీకి ని ఆదికవి అని అంటారు. రామాయణ సమాసం సంస్కృతం లో "రామస్య అయనం" రాముని యొక్క చరిత్ర అని అలాగె రామాయ:అయనం అంటే ఇక్కడ రామా శబ్దం స్త్రీ లింగం అగుట చేత ,రామా అంటె సీత అనే అర్ధం కూడా వస్తుంది కనుక సీత యొక్క చరిత్ర అని కూడా అర్ధం వస్తుంది. రామాయణం కావ్యమే కాదు, ధర్మ శాస్త్రం కూడా. ఇందులొ పుత్రధర్మము, మిత్రధర్మము, బ్రాతృధర్మము, భర్తృధర్మము, శిష్యధర్మము అన్నిటిని కూడా రాముడు తను ఆచరించి లోకానికి మార్గదర్సకుడు అయ్యారు. పరసతులని ఆసించిన రావణడు, పులస్త్యబ్రహ్మ ఐన కుడా అపకీర్తి ని పొంది చివరికి అధోగతి చెందాడు.
రామయణం లో అన్నిటికన్న అత్యధ్భుతమైన వర్ణన సుందరకాండము. అసలు ఎందుకు "సుందర"కాండం అని పిలవబడుచున్నది ? ఈ లోకం లో బాహ్య సౌందర్యం , అంత:సౌందర్యం అని రెండు విధములు కదా ..భార్యభర్తలు ఆత్మీయతతో, ఆదరాభిమానలతో ఉన్నప్పుడు వారిద్దరు ఒకరికొకరు అందంగా కనిపిస్తారు. అలాగే వారి పిల్లకు మార్గదర్సకులైతే వాళ్ళు చాలా సౌందర్యవంతులుగా కనిపిస్తారు ..అలాగే ఇది ప్రకృతి యొక్క అతి సహజమైన సుందరం. కాని సుందరకాండ లోక సాధారణ స్థితికి భిన్నంగా అత్యద్భుతమైన సౌందర్యం కలిగినది అందుకే "సుందర"కాండ అయ్యింది.

సుందరె సుందరో రామ: సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీత సుందరే సుందం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

పురషమోహనాకారుడు, సుగుణగణ సుందరుడు శ్రీరాముడు, సర్వ విధములా భువనైక మాత సీతా దేవి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమసుందరుడు. అశోకవనం అతిలోక సుందరం. శ్రీ సీతరామహనుమంతుల మంత్రములు దివ్యములు సుందరములు. ఈ మహితాత్ముల కధ సర్వాధ్భుత సుందరం. ఈ సుందరకాండ కవిత్వం అత్యంత సుందరం. కనుక ఈ సుందరకాండమునందు సుందరం కానిదేది? సర్వమూ సుందరమే. ఇందు హనుమంతుని చే సీతారాముల వర్ణన అద్భుతము గా చెప్పబడినది.

హనుమంతుని ప్రతిభ ::

హనుమంతుడు జితేంద్రియుడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు, వాయు సుతునకు ఏకైక లక్ష్యం. ఒక స్త్రీ ని స్త్రీ ల మధ్యనే వెదుకుట ,అదియును అర్ధరాత్రి వేళ రావణుని ఏకాంత మందిరమున అతని కాంతల మధ్య వెదుకుట , హనుమంతుని యొక్క నిశ్చల బుద్ది కి జితెన్ద్రియత్వమునకు నిదర్సనం.సుందరీ సుందరుల గాధను తెలుపునది సుందరకాండము. సుందరకాండము సాధకుని లో పరమాత్మ యొక్క అంశ శ్రీరాముని తో ప్రకృతి అంశ అయిన సీతమ్మను కలుపుటకు హనుమంతుడు చేసిన "అన్వేషణే ". ఆంజనేయుడు అనగా బుద్ది యోగము.

సుందరకాండ గురించి మా తెలుగు ఆచార్యులు చెబుతుంటే అద్భుతంగా ఉండేది. అందులో హనుమంతుడు లంక నుండి తిరిగి రాముని దర్సించగానే "దృష్టా దేవితి" అంటే చూచితిని సీతను అని అర్ధం వస్తుంది.ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న రామునికి ఈ ఒక్క చిన్న మాట ఆయనుకు ఉపసమనం ఇస్తుంది , ఆ వర్ణ న అద్భుతంగా చెప్పేవారు. లంకా అనే పదాన్ని తిరగ రాస్తే కాలం అనే అర్ధం వస్తుందని , కాలం అనె పదానికి నలుపు అనే అర్ధం వస్తుందని, నలుపు అంటె తమో గుణానికి కారణమని, దానికి బుధ్ధి కి ప్రతీక అయిన హనుమంతుడు పూర్తిగ దహించేట్లు చెయ్యడం లో అర్ధం , మనలోని తమో గుణాన్ని , సరైన బుద్ది తో దూరం చేసుకొవాలని ఎంతో చక్కగ చెప్పేవారు.

రామాయణాన్నిపూర్తిగా చెప్పే లవకుశ లో ఈ పాట నాకెంతో ఇష్టం..

(యూట్యూబ్ మరియు గీతా ప్రెస్స్ వారి సౌజన్యం తో )

Friday, April 11, 2008

ఆహా ఏమి రుచి ..

"శాకంబరి దేవి ప్రసాదం...ఆంధ్ర శాఖం ..గోంగూర " ఈ మాటలు అందరికి సుపరిచితమైన వే ...అదేనండి అల్లు రామలింగయ్య మాయాబజార్ లో అన్నమాటలు ..మహాభారతం లో పిట్టకద లాంటి మాయాబజార్ లో కూడా గోంగూర గురించి ప్రస్తావించి దాని మీద తన ఇష్టాన్ని , ఆంధ్రుల మీద అభిమానాన్ని, చతురతని చాటుకున్నారు పింగళి గారు. ఏది ఏమైనా విందులో మాత్రం గోంగూర స్టేటస్ వేరు. . గోంగూర తో నా అనుభందాలను నెమరు వేసుకోవాలనిపించింది ఒక్క నాకేమిటి ఆంధ్రుడైన ప్రతి ఒక్కరి కి గోంగూర అనగానే ఏదో ఒక అనుభూతి తప్పకుండా ఉండనే ఉంటుంది. నా మటుకు గోంగూర అనగానే లాలాజలం ఊరిపోతుంది . దాన్ని ఆపడం ఒక్క గొంగూరకే సాధ్యం. వేడి వేడి అన్నం లో గోంగూర పచ్చడి ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటుంటే ఒహ్ ...వర్ణించడానికి మాటలు చాలవు ..

పాపం గోంగూర కి కుడా తప్పలేదు ప్రాంతీయతా భావం. గుంటూరు గోంగూర కి మిగతా ప్రాంతాల గోంగూరకి చాల తేడా ఉందని ఎప్పడు గోంగూర తిన్నాదాని మీదో టాపిక్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది మా ఇంట్లో. మా మామయ్యా గారైతే ...వాళ్ల బామ్మగారు రాచ్చిప్పల్లో గోంగూర పులుసు వండే విధానం , మూడు రోజులైనా పాడైపోకుండా ఉండేదని తలచుకుంటునే ఉంటారు .. గోంగూర తింటున్నప్పుడల్లా....!!!అంటే దీని పర్యవసానం గొంగురాభిమానమనేది తర తరాలదన్నమాట. ఇప్పటిది కాదు.

ఇక కార్తిక, మార్గశిర మాసాల్లో ఐతే మా పాలేరు ఏమి తెచ్చిన తేకపోయిన గోంగూర , పచ్చిమిరపకాయలు మాత్రం ఠంచనుగా తెచ్చేసేవాడు .. ఆ పొలం గట్ల మీద దొరికే గోంగూర అంత ఫ్రెష్ గా ..ఫ్రెష్ ఫ్రెష్ అని చావగొట్టె రిలయన్స్ ఫ్రెష్ లో నేను ఎప్పుడూ చూడలేదు ..కాని ఆ ఫ్రెష్కి వెళ్ళినప్పుడు సరుకుల్లో భాగంగా ప్రియమ్మ (అదేనండి ప్రియ పచ్చడి ) తయారు చేసే పచ్చడి కుడా చేరిపోతుంది .మా అమ్మగారు చేసే పచ్చడిని తలచుకోవడం ,ప్రియమ్మ పచ్చడి ని తిట్టుకోవడం ..ఆఖరికి సీసా ఖాళీ చెయ్యడం పరిపాటే ..ఇన్ని సంజాయీషీలు ఎందుకు నువ్వే చేసుకోవచ్చు కదా అని కూడా అడుగుతుంటారు ..బద్దకించి మాత్రం కాదు, ఎందుకంటే మేముండేది ఆంధ్రాకి నాలుగు గంటల దూరమే అయిన ఇక్కడ(మద్రాసు లో)గోంగూర దొరకడం కష్టం .

గోంగూర మీద ఆశ కొంత మందిని దొంగలుగా కుడా మార్చేస్తుందండి. ఇది నిజ్జంగా నిజ్జం ..ఆ మధ్య మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది..ఇక ఆ కార్యం లో గోంగూర ఉంటే వచ్చిన వాళ్లు కూడా సంతోషిస్తారు కదా ..అని వంట వాళ్ళని పురమాయించారు మా అమ్మగారు ..అదేంటో గాని ఆ రోజు వంటవాళ్ళు అద్భుతంగా చేసారు గోంగూర పచ్చడి . మొదటి బంతి లో నే కూర్చున్న తెలిసిన ఆవిడ ఒకరు పెరట్లో కి వెళ్లి ఎవరు చూడకుండా గోంగూర పచ్చడి డబ్బాలో పెట్టుకు పోయారట ..ఆ విషయం ఈ మధ్య మా వంట మనిషి చెబితే విని ఆశ్చర్య పోయా ..గోంగూర పచ్చడి పాపం మనుషులని దొంగలు గా కుడా మారుస్తుందని నవ్వుకున్నా ... మా నాన్నగారు చనిపొయే ముందు రోజు చివరి సారి గా కలిసి భోంచేసినప్పుడు గోంగూర పచ్చడి ఉండడం కూడా యాదృచ్చికమేమో..

Monday, April 7, 2008

అదే నీవు.. అదే నేను


నిన్ను చూడకుండా తెల్ల వారేది కాదు,
నా కనురెప్పల కాటుక కళ్ళ అందాన్ని నీలో చూసుకుని మైమర్చిపోయాను.
నా నుదుటన కుంకుమ తిలకాన్ని చూసి ఉషోదయ సూర్య బింబం లా ఉందన్నావు,
చిక్కుముళ్ళు పడిన నా కురులను క్షణాల్లో సరి చేసావు,
నేను వోణి వేసుకుంటే, నువ్వు పదహారణాల తెలుగమ్మాయి లా ఉన్నానన్నావు,
చీర కట్టులో స్త్రీ అందాన్ని చూపించావు,
అప్పట్లో అమ్మ తిడుతున్నా నీతో నే కాలక్షేపం చేశాను,
ఇప్పట్లో నిన్ను చూడాలంటేనే నాలో విరక్తి,
అదే నీవు, అదే నేను, కాని మనిద్దరి మధ్యా ఎందుకింత దూరం..?
నిజాలను నిర్భయంగా చెప్పగల నిలువుటద్దానివి నీవు ,
తరిగిపోయిన నా అందాన్ని వార్ధక్య రూపం లో చూపిస్తున్నావు
అందుకే నువ్వంటే నాకు విరక్తి ,
అందుకే మనిద్దరి మధ్యా ఇంత దూరం.

Thursday, April 3, 2008

అపురూపమైన కానుక.


అప్పటి దాకా పట్టు పరికిణి వేసుకుని పేరంటానికి నేను వస్తాను అని గొడవ చేసే చిన్నారి ప్రౌఢ వయసు రాగానే నేను రాను ఇంట్లో నే ఉంటాను అంటున్న కూతురుని చూసి కలత చెందింది ఆ తల్లి మనసు. ప్రకృతి సిద్దమైన తన లో ని మార్పులకు విస్తుపోయిందా చిన్నారి . మేనమామ చేతుల మీదుగా తోలి సారె అందుకుని మురిసిపోయింది. ఆడుతూ,పాడుతూ తిరుగుతున్న ఆ చిన్నారికి బామ్మగారి మాటలు చెవిన పడ్డాయి. ఎంతైనా 'ఆడ'పిల్లనే కదా అని కన్నెమనసుకి సర్ది చెప్పుకుంది. ఆ యవ్వనవతిని ఘనంగా సారెనిచ్చి అత్తవారింటికి సాగనంపి కన్యాదాన ఫలం దక్కించుకున్నాడా తండ్రి. శ్రావణాల పౌర్ణమిని తలచుకుని రక్తభందాన్ని నూలు దారాలుగా పంపిన ఆ చిన్నారి చెల్లికి, దీవెనలు కానుకల రూపం లో పంపారా తోబుట్టువులు. ప్రకృతి కి ప్రతిరూపమైన ఆ కాబోయే తల్లిని సీమంతం చేసి పురిటింటికి సాగానంపారా అత్తవారు. ప్రకృతి పరవసించిపోయింది.
కూతురుగా, చెల్లిగా, కోడలిగా, భార్యగా, తల్లిగా తన వారినందరిని మరపింప చేస్తున్న ఆడపిల్లకి సమాజం లో ఈసడింపులు, పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, అత్యాధునిక పరిజ్ఞానం తో తన తొలి ఊపిరినే ఆపెయ్యడం. ప్రకృతి కే ఇది అమానుషం.
ప్రకృతి అపురూపమైన కానుక ఆడ జన్మ. జన్మ,జన్మ ల కి ఆడజన్మే కావాలని కోరుకునేట్లు పరివర్తన చెందుదాం


రష్యా జానపద కధ తెలుగు అనువాదం

అల్యోనుష్క మరియు సోదరుడు ఇవానుష్క.

ఒకానొకప్పుడు , అందమైన ప్రదేశం లో, ఒక అక్క, తమ్ముడు, నడచుకుంటూ వెళ్తున్నారు. వారి పేర్లు అల్యౌనుష్క మరియు ఇవానుష్క. వారు అలా నడచుకుంటూ చాల దూరం వెళ్తుండగా వారికీ ఒక గొడ్ల చావిడి లో పశువుల కోసం వుంచిన నీరు కనిపించింది "అక్కా ,నేను ఆ నీరు తాగుతా" అడిగాడు చిన్న వాడయిన ఇవానుష్క. "వద్దు , నువ్వు దూడలా మారిపోతావు " అని అనింది అల్యోనుష్క. దాహంగా ఉన్నా, ఇవానుష్క అక్క మాటలకు సరేనన్నాడు. వారు అలా కొద్ది దూరం వెళ్ళగా వారికి ఒక గుర్రపుశాల లో గుర్రాల కోసం ఉంచిన నీరు చూసి దాహంగా ఉన్నఇవానుష్క నీరు తాగుతానని అడిగాడు అల్యోనుష్క ని. అవి తాగితే గుర్రపు పిల్లలా మారిపోతావు వద్దు అంటుంది. ఈ సారి కుడా సరే అన్నాడు ఇవానుష్క. అలా వెళ్తుండగా వారికి మేకల కోసం ఉంచిన నీరు కనిపించింది. దాహాన్ని ఆపుకోలేని ఇవానుష్క , అక్క వారిస్తున్నా వినకుండా ఆ నీరు తాగేసాడు ఇవానుష్క. తాగిన మరు క్షణమే చిన్న మేక పిల్లలా మారిపోయిన ఇవానుష్క ని చూసి విలపిస్తుంటుంది అల్యోనుష్క. అటుగా వెళ్తున్నఒక వర్తకడు జరిగింది తెలుసుకుని , తనని పెళ్లి చేసుకుంటే నువ్వు , మేక పిల్లలా మారిన నీ తమ్ముడు సంతోషంగా నా తోటే ఉండచ్చు అని చెప్తాడు.
అలా కొద్దిరోజులు సంతోషంగా గడుపుతుండగా ,ఒక రోజు , ఒక మంత్రగత్తె అల్యోనుష్క ని మాయ చేసి , నది ఒడ్డు కి తీసికెళ్ళి మెడకో రాయి కట్టి నీటిలో తోసేసి , అల్యోనుష్కలా మారిపోయి , సంతోషంగా వర్తకుడు తో కలిసి ఉంటుంది. పాపం, మేక పిల్లలా మారిన ఇవానుష్క కి మాత్రమె అసలైన నిజం తెలుసు. ఒక రోజు నది దగ్గర అల్యోనుష్క తో మాట్లాడటం చూసిన ఇవానుష్క తననని కుడా ఏదో చెయ్యాలని కుట్ర పన్నుతోందని అనుకుంటాడు .
అల్యోనుశ్క రూపం లో ఉన్న మంత్రగత్తె, మేక పిల్ల లా మారిన ఇవానుష్క ని చంపెయ్యమని చెప్తుంది వర్తకుడి . అది తన మనసుకి,కష్టం అనిపించినా భార్య రూపం లో ఉన్నమంత్రగత్తె మాటలను వింటాడు వర్తకుడు.
చంపేముందు చివరి సారిగా మంచి నీళ్లు తాగడానికి నది దగ్గరికి తీసుకు వెళ్ళమని అడుగుతాడు మేక పిల్ల రూపం లో ఉన్న ఇవానుష్క . అక్కకి తన పరిస్థితి చెప్పుకుంటాడు. తన మెడ కి రాయి కట్టుందని , ఇప్పుడు తను ఏ విధంగాను సహాయం చెయ్యలేనని చెప్తుంది.
అక్కడే ఉన్న గొడ్ల కాపరి వారిద్దరి సంభాషణ వినడం అక్క, తమ్ముళ్ళూ గమనించలేదు.
వర్తకుడి కి జరిగింది వివరిస్తాడు కాపరి. వర్తకుడు, పరిగెత్తుకుంటు వచ్చి నది లో ఉన్న అల్యొనుష్క ని బయటకి తీసుకు వచ్చి , మెడ కి కట్టి ఉన్న రాయి తీసి పారేస్తాడు.
మంత్రగత్తె ని పట్టుకుని, మదమెక్కిన గుర్రానికి కట్టెసి , గుర్రాన్ని వదిలేస్తారు. అది పొలం లో పిచ్చి గా అరుస్తూ , మంత్రగత్తె ని ఈడ్చుకుని పోతుంది. ఇవానుష్క కి తన మేక పిల్ల రూపం పొయి తిరిగి మాములుగా మారిపోతాడు. ఆ తరువాత ముగ్గురు సంతోషంగా కాలం గడుపుతుంటారు.

Tuesday, April 1, 2008

స్నేహితుని కై అన్వేషణలో ...

అప్పుడప్పుడె స్నేహితుని కోల్పొయిన క్షణాల లో ఉండగా తిరిగి అతనిని చూసాను.
అంత మంది లొ మిరుమెట్లుగొల్పుతు అతని కండ్లు, గుచ్చి గుచ్చి చూసే అతని చూపులు నా దృష్టి ని మరల్చాయి. అతను తిరిగి మళ్ళి నన్ను చేరాలనే ప్రయత్నం.
ఎక్కడికి వెళ్ళినా నన్ను నీడలా వెంబడించే ఆ భయంకరమైన రోజులన్ని గుర్తుకు వస్తున్నాయి.
నేను ఒంటరిగా ఉన్నా లేక పది మందిలో ఉన్నా అతను లెక్క చేసేవాడు కాదు. చాల సార్లు అతని చూపులనుంచి తప్పించుకోవాలని నాకు నేను గా సమయాన్నంతా పుస్తకాల లో నో లేక సంగీతం వినడం లో నో గడిపే దాన్ని. కాని నా ఆలోచనలన్ని నేను ఊహించని విధంగా అతని చుట్టూ పరిభ్రమిస్తుండేవి. ఇక అతను నా కలల్లో కుడా నన్ను వేటాడుతుండే వాడు.
అతన్ని చూస్తే నాలో చెప్పలేని భయం.
అతనంటే రోజు రోజు కి ద్వేషం, ఇప్పుడు నాకు అతనో పరమ శత్రువు.
అతనంటే రోజు రోజు కి నా లో భయం పెరిగి పోతోంది.
ఇక అతని ఆలోచనల వెనక పరిగెత్తడం మానేసాను. కొత్త పరిచయాలు, స్నేహాల్లో అతన్ని మర్చిపోదామని ప్రయత్నించాను. అవి అన్ని నిర్వీర్యమైపోయాయి. అతను నా చుట్టూ ఉన్నప్పుడు ఉన్న క్షణాలని తల్చుకుని బిగ్గరగా ఏడ్చాను. భగవంతుడా నాకో మార్గం చూపించమన్నాను. మరు క్షణం ధైర్యం తెచ్చుకుని నేనే అతని దగ్గరకి వెళ్ళాను. నా చేతులు జోడించి అతనిని స్నేహితుని గా ఆహ్వానించాను. ఇప్పుడు అతను నాకు ఓ మంచి మిత్రుడు గా మారిపోయాడు. నాకేలాంటి సమస్యలు లేవు. మొదట నుండి అర్ధం చేసుకోవడం లో నేనే తప్పు చేసానేమో, అతన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాక, చాల మంచివాడనిపించింది. అతనితో స్నేహం నాలో ఉన్న ద్వేషాన్ని, కసిని దూరం చేసింది. ఇప్పుడు మాది విదదీయరాని స్నేహం. అతను ఎవరో కాదు నాలొ ఉన్న ఒంటరితనం. అతనే నాలోని ఒంటరి.